చరిత్ర సృష్టించిన ఆండర్సన్‌.. ఆ ఘనత సాధించిన ఒకే ఒక్కడు

IND Vs ENG: James Anderson Becomes First Bowler To Take 400 Test Wickets In England - Sakshi

లీడ్స్‌: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో అజింక్య రహానే వికెట్‌ పడగొట్టడం ద్వారా ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర జేమ్స్‌ ఆండర్సన్‌ చరిత్ర సృష్టించాడు. స్వదేశంలో(ఇంగ్లండ్‌ గడ్డపై) 400 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా అతను రికార్డుల్లోకెక్కాడు. ఆండర్సన్‌కు ముందు ఇంగ్లండ్‌లో ఏ ఇతర బౌలర్‌ కూడా ఈ ఘనతను సాధించలేదు. ఈ జాబితాలో ఆండర్సన్‌ తర్వాతి స్థానంలో స్టువర్ట్‌ బ్రాడ్‌(341 వికెట్లు), ఫ్రెడ్‌ ట్రూమన్‌(229 వికెట్లు) ఉన్నారు. 

ఇక, ఓవరాల్‌ సొంత గడ్డపై 400 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన జాబితాలో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీథరన్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. అతని తర్వాత ఆండర్సన్‌(400), అనిల్‌ కుంబ్లే(350), స్టువర్ట్‌ బ్రాడ్‌(341),షేన్‌ వార్న్‌(319) వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, భారత్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో ఆండర్సన్‌ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే భారత జట్టుకు అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు అండర్సన్ భారత్‌కు 330 మెయిడిన్ ఓవర్లు వేసాడు. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ బౌలర్ డెరెక్ అండర్‌వుడ్‌పై నమోదై ఉంది. అండర్‌వుడ్ భారత్‌కు 322 మెయిడిన్ ఓవర్లు వేసాడు.

కాగా, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ముగిసిన మూడో టెస్ట్‌లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకే ఆలౌటైన భారత్.. ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో ఇంగ్లండ్ 1-1తో సిరీస్‌ను సమం చేసింది. 215/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌ ఏ దశలోనూ కనీస పోరాటం ఇవ్వలేకపోయింది. మ్యాచ్‌ ప్రారంభమైన పది నిమిషాల నుంచే వికెట్ల పతనం మొదలైంది. ఓలి రాబిన్సన్‌(5/65), ఒవర్టన్‌(3/47) ధాటికి భారత్ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కలిపి మ్యాచ్‌ మొత్తంలో 7 వికెట్లు పడగొట్టిన రాబిన్సన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్‌ సెప్టెంబర్‌ 2 నుంచి ప్రారంభంకానుంది.  
చదవండి: టీమిండియాకు పరాభవం.. ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top