IND Vs ENG 3rd Test Day 4: టీమిండియాకు పరాభవం.. ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి

IND Vs ENG 3rd Test Day 4: Highlights And Updates - Sakshi

టీమిండియాకు పరాభవం.. ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా ఘోర పరాభవాన్ని మూట గట్టుకుంది. ఆతిధ్య జట్టు చేతిలో ఇన్నింగ్స్‌ 76 పరగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 215/2తో నాలుగో రోజు ఆట ఆరంభించిన భారత్‌ వరుసగా వికెట్లు సమర్పించుకుంటూ తొలి సెషన్‌లోనే చాపచుట్టేసింది. ఇంగ్లండ్‌ పేసర్ల ధాటికి టీమిండియా ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో 63 పరుగులు జోడించి 278 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇంగ్లండ్‌ బౌలర్లు రాబిన్సన్‌(5/65), ఒవర్టన్‌(3/47) టీమిండియా పతనాన్ని శాసించారు. ఆండర్సన్‌, మొయిన్‌ అలీకి తలో వికెట్‌ దక్కింది. కాగా,  ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి టెస్ట్‌ డ్రా కాగా, రెండో టెస్ట్‌లో భారత్‌ గెలుపొంది 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే, మూడో టెస్ట్‌లో ఆతిధ్య జట్టు గెలుపొందడంతో సిరీస్‌ 1-1తో సమం అయ్యింది. ఇరు జట్ల మధ్య  నాలుగో టెస్ట్‌ సెప్టెంబర్‌ 2 నుంచి ప్రారంభంకానుంది.  

ఇన్నింగ్స్‌ ఓటమి దిశగా టీమిండియా.. తొమ్మిదో వికెట్‌ డౌన్‌
ఇన్నింగ్స్‌ ఓటమికి టీమిండియా మరో వికెట్‌ దూరంలో ఉంది. ఒవర్టన్‌ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి జడేజా(30) తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్‌ 278/9. ఇన్నింగ్స్‌ పరాభవాన్ని తప్పించుకోవాలంటే మరో 76 పరుగులు చేయాల్సి ఉంది. 

రాబిన్సన్‌కు ఐదు వికెట్లు.. ఇషాంత్‌(2) ఔట్‌
ఇంగ్లండ్‌ పేసర్‌ రాబిన్సన్‌ ఖాతాలో మరో వికెట్‌ పడింది. వికెట్‌కీపర్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఇషాంత్‌(2) వెనుదిరిగాడు. ఈ వికెట్‌తో రాబిన్సన్‌ ఒకే ఇన్నింగ్సలో 5వికెట్ల ఘనతను రెండోసారి సాధించాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్‌ 257/8. ఇన్నింగ్స్‌ ఓటమి పరాభవాన్ని తప్పించుకోవాలంటే భారత్‌ మరో 97 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో జడేజా, బుమ్రా ఉన్నారు. 

టీమిండియాకు ఇన్నింగ్స్‌ ఓటమి తప్పేలా లేదు.. షమీ(6) ఔట్‌
మూడు టెస్ట్‌లో టీమిండియాకు ఘోర పరాభవం తప్పేలా లేదు. నాలుగో రోజు తొలి సెషన్‌లో వరుసగా పెవిలియన్‌కు క్యూ కడుతున్న భారత ఆటగాళ్లు కనీసం ఇన్నింగ్స్‌ ఓటమి పరాభవాన్ని తప్పించుకుందాం అన్న ధ్యాస లేకుండా వికెట్లు సమర్పించుకుంటున్నారు. 239 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌ మరో 15 పరుగులు జోడించి 254 పరుగుల వద్ద ఏడో వికెట్‌(షమీ)ను కోల్పోయింది. షమీ(6) ని మొయిన్‌ అలీ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఇన్నింగ్స్‌ ఓటమి పరాభవాన్ని తప్పించుకోవాలంటే టీమిండియా మరో 100 పరుగులు చేయాల్సి ఉంది. 

రాబిన్సన్‌ విజృంభణ.. ఆరో వికెట్‌ కోల్పోయిన టీమిండియా, పంత్‌(1) ఔట్‌
ఇంగ్లండ్‌ పేసర్‌ రాబిన్సన్‌ నిప్పులు చెరిగే బంతులతో టీమిండియా ఆటగాళ్లను కుదురుకోనివ్వట్లేదు. నాలుగో రోజు ఆటలో తొలుత పుజారాను ఔట్‌ చేసిన రాబిన్సన్‌.. ఆతర్వాత కోహ్లిని, తాజాగా పంత్‌ను పెవిలియన్‌కు పంపి టీమిండియా ఓటమికి బాటలు వేస్తున్నాడు. రాబిన్సన్‌(4/58) ధాటికి భారత్‌ 239 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో జడేజా, షమీ ఉన్నారు. ఇన్నింగ్స్‌ ఓటమి తప్పించుకోవాలంటే టీమిండియా మరో 115 పరుగులు చేయాల్సి ఉంది. 

ఓటమి బాట పట్టిన టీమిండియా.. వరుస ఓవర్లలో కోహ్లి(55), రహానే(10) ఔట్‌
నాలుగో రోజు తొలి సెషన్‌లోనే టీమిండియా ఖేల్‌ ఖతం అయ్యేలా కనిపిస్తుంది. ఓవర్‌నైట్‌ స్కోర్‌కు ఒక్క పరుగు కూడా జోడించకుండానే పుజారా(91) వెనుదిరగగా, తాజాగా వరుస ఓవర్లలో కోహ్లి(55), రహానే(10) పెవిలియన్‌ బాట పట్టారు. దీంతో టీమిండియా 239 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమిని దాదాపు ఖరారు చేసుకుంది. కోహ్లి రాబిన్సన్‌ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ కాగా, రహానేను ఆండర్సన్‌ బోల్తా కొట్టించాడు. క్రీజ్లో పంత్‌(1), జడేజా(0) ఉన్నారు. ప్రస్తుతం భారత్‌ మరో 115 పరుగులు వెనుకబడే ఉంది.

అనుకున్నదే జరిగింది.. ఆదిలోనే పుజారా(91) ఔట్‌
టీమిండియా అభిమానులు ఏదైతే జరగకూడదని అనుకున్నారో అదే జరిగింది. పుజారా(91) తన ఓవర్‌నైట్‌ స్కోర్‌కు ఒక్క పరుగు కూడా జోడించకుండానే రాబిన్సన్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు చిక్కాడు. దీంతో టీమిండియా మూడో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం భారత్‌ ఇంకా 139 పరుగులు వెనుకబడే ఉంది. క్రీజ్‌లోకి రహానే వచ్చాడు. 

లీడ్స్‌: తొలి ఇన్నింగ్స్‌ వైఫల్యాల్ని అధిగమించేందుకు భారత బ్యాట్స్‌మెన్‌ రెండో ఇన్నింగ్స్‌లో పట్టుదలతో ఆడుతున్నారు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (156 బంతుల్లో 59; 7 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించగా, చతేశ్వర్‌ పుజారా (180 బంతుల్లో 91 బ్యాటింగ్‌; 15 ఫోర్లు) సెంచరీకి చేరువయ్యాడు. కెప్టెన్‌ కోహ్లి (94 బంతుల్లో 45 బ్యాటింగ్‌; 6 ఫోర్లు) క్రీజులో పాతుకుపోయాడు. 80 ఓవర్లు అంటే దాదాపు రోజంతా (సాధారణంగా 90 ఓవర్లు) బ్యాటింగ్‌ చేసిన టీమిండియా కేవలం రెండే వికెట్లు సమర్పించుకుంది. 

మూడో రోజు ఆట నిలిచే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 215 పరుగులు చేసింది. రాబిన్సన్, ఓవర్టన్‌లకు చెరో వికెట్‌ దక్కింది. ప్రస్తుతం భారత్‌ ఇంకా 139 పరుగులు వెనుకబడే ఉంది. నాలుగో రోజు తొలి సెషన్‌లో పుజారా, కోహ్లి ఓపికగా ఆడగలిగితే టీమిండియాదే పైచేయి అవుతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇక ఈ రోజు ఆటలో మనోళ్లు నిలబడతారా..? లేక చేతులెత్తేస్తారా అన్నది వేచి చూడాల్సిందే. 
చదవండి: అంపైర్‌ను భయపెట్టిన పుజారా.. తృటిలో తప్పించుకున్నాడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top