Rishabh Pant Controversy: వివాదంలో చిక్కుకున్న పంత్‌.. మందలించి వదిలిపెట్టిన అంపైర్లు

IND Vs ENG 3rd Test: Rishabh Pant Lands In Controversy On Day 2 At Headingley - Sakshi

లీడ్స్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌ రెండో రోజు ఆటలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్‌ పంత్ నిబంధనలు అతిక్రమించాడు. అలా జరగడం తొలిసారి కావడంతో అంపైర్లు అతన్ని మందలించి వదిలి పెట్టారు. వివరాల్లోకి వెళితే.. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) నిబంధనలకు విరుద్దంగా పంత్.. తన కీపింగ్ గ్లోవ్స్‌కు టేప్ చుట్టుకుని వివాదంలో చిక్కుకున్నాడు. 

ఇది గుర్తించిన థర్డ్ అంపైర్.. ఫీల్డ్ అంపైర్లకు సమాచారం ఇవ్వడంతో వారు పంత్‌ను మందలిస్తూ.. కెప్టెన్ కోహ్లి సమక్షంలో టేప్‌ను తొలగించారు. మూడో రోజు ఆట చివరి సెషన్‌ ప్రారంభానికి ముందు ఇది జరిగింది. ప్రస్తుతం ఈ అంశంపై సోషల్‌మీడియా వ్యాప్తంగా విపరీతమైన చర్చ నడుస్తోంది. పంత్ చీటింగ్‌కు పాల్పడ్డాడంటూ ఇంగ్లండ్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు.
చదవండి: ఇంకా రెండు మ్యాచ్‌లున్నాయ్! దిగులెందుకు..

కాగా, ఎంసీసీ 27.2.1 నిబంధన ప్రకారం వికెట్ కీపింగ్ గ్లోవ్స్‌కు టేప్ వేయకూడదు. ‌ముఖ్యంగా చూపుడు వేలు, బొటన వేలు మినహాయించి ఇతర వేళ్ల మధ్య వెబ్బింగ్(టేప్‌ చుట్టడం) చేయకూడదు. అలా చేస్తే కీపర్‌కు అడ్వాంటేజ్‌గా ఉంటుంది. కానీ పంత్ తన గ్లోవ్స్‌కు టేప్ చుట్టుకోవడంతో అంపైర్ అలెక్స్ వార్ఫ్.. అతన్ని మందలించి నిబంధనలకు విరుద్దమని చెప్పాడు.

ఇదిలా ఉంటే, పంత్‌ వెబ్బింగ్‌ ఘటన గుర్తించక ముందు( ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 94 ఓవర్‌లో) ఇంగ్లండ్‌ ఆటగాడు డేవిడ్ మలాన్(70) కీపర్ క్యాచ్‌గా  ఔటయ్యాడు. దీంతో మలాన్‌ను నాటౌట్‌గా పరిగణించి వెనక్కి రప్పించాలని కామెంటేటర్ డేవిడ్ లాయడ్ డిమాండ్ చేశాడు. పంత్‌ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించాడు కాబట్టి అంపైర్లు జోక్యం చేసుకుని మలాన్‌ను నాటౌట్‌గా ప్రకటించాలని కోరాడు. 

కాగా, 423/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ మరో 9 పరుగులు మాత్రమే జత చేసి 432 పరగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ ఒవర్టన్(32) తన ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో 8 పరుగులు జోడించి షమీ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోగా.. మరో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ ఓలీ రాబిన్సన్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో రూట్ సేనకు 354 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో షమీ 4, జడేజా, సిరాజ్‌, బుమ్రా తలో 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. కపడటి వార్తలు అందేసరికి కేఎల్‌ రాహుల్‌(8) వికెట్‌ నష్టపోయి 35 పరుగులు చేసింది.
చదవండి: మనతో ఆట అంటే మజాకా.. రికార్డులు బద్దలవ్వాల్సిందే..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top