Joe Root: అదును చూసి విరుచుకుపడ్డాం.. ఇంగ్లండ్‌ బౌలర్లను ఆకాశానికెత్తిన రూట్‌

IND Vs ENG 3rd Test: Joe Root Lauds Bowlers For Tremendous Victory Over India - Sakshi

లీడ్స్‌: టీమిండియాతో జరిగిన మూడో టెస్ట్‌లో అతిధ్య ఇంగ్లండ్‌ జట్టు ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన అనంతరం ఇంగ్లండ్‌ సారధి జో రూట్‌ తమ బౌలర్లను ఆకాశానికెత్తాడు. ఈ విజయం కచ్చితంగా బౌలర్లదేనని కొనియాడాడు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారని, వరుస మెయిడిన్లతో టీమిండియా ఆటగాళ్లపై ఒత్తిడి పెంచారని అన్నాడు. వికెట్లు తీసే అవకాశం కోసం ఎదురు చూసామని, అదును చూసి కనికరం లేకుండా విరుచుకుపడ్డామని పేర్కొన్నాడు. నాలుగో రోజు కొత్త బంతితో తమ బౌలర్లు చెలరేగుతారని ముందే ఊహించామని తెలిపాడు. 

తొలి రోజు అండర్సన్‌ అద్భుత ప్రదర్శనతో టీమిండియాపై పైచేయి సాధించేలా చేశాడని, అతనికి రాబిన్సన్‌ మద్దతు తోడవ్వడంతో ప్రత్యర్ధిని కోలుకోలేని దెబ్బ తీసామని అన్నాడు. లేటు వయసులో అండర్సన్‌ యువ బౌలర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడని, అందుకే అతడిని టెస్టు క్రికెట్‌లో 'గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌' అని అభివర్ణిస్తారని కొనియాడాడు. ఇక బ్యాటింగ్‌లో రాణించిన ఓపెనర్లు రోరీ బర్న్స్‌, హమీద్‌తో పాటు డేవిడ్‌ మలన్‌పై కూడా రూట్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. తన హోమ్‌ గ్రౌండ్‌లో చాలా రోజుల తర్వాత శతకం బాదడం గొప్పగా ఉందని రూట్ పేర్కొన్నాడు. కాగా, లీడ్స్‌లో విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్‌ 1-1తో సమం చేసుకుంది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్‌ సెప్టెంబర్‌ 2 నుంచి ప్రారంభంకానుంది.
చదవండి: క్రీడల‌ను అల‌వాటుగా మార్చుకోండి.. స‌చిన్ సందేశం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top