IND VS BAN 1st ODI: క్యాచ్‌కు కనీస ప్రయత్నం చేయని సుందర్‌.. బండ బూతులతో విరుచుకుపడిన రోహిత్‌

IND VS BAN 1st ODI: After Sundar Fielding Lapse, Rohit Sharma Loses Cool - Sakshi

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డే‌లో టీమిండియా వికెట్‌ తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. టీమిండియా నిర్ధేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 136 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచిన బంగ్లాదేశ్‌.. మెహిది హసన్‌ (38 నాటౌట్‌), ముస్తాఫిజుర్‌ (10 నాటౌట్‌) వీరోచితంగా పోరాడటంతో చారిత్రక విజయం సాధించింది. మెహిది హసన్‌, ముస్తాఫిజుర్‌ చివరి వికెట్‌కు అజేయమైన 51 పరుగులు జోడించి, టీమిండియా చేతుల్లో నుంచి గెలుపును లాగేసుకున్నారు. 

ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డర్లు చేసిన ఘోర తప్పిదాలు బంగ్లాదేశ్‌ పాలిట వరాల్లా మారాయి. అంతవరకు అద్భుతంగా బౌలింగ్‌ చేసిన భారత బౌలర్లు సైతం ఫీల్డర్ల చెత్త ప్రదర్శనతో ఒక్కసారిగా ఢీలా పడిపోయి, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. బంగ్లా విజయానికి 51 పరుగులు అవసరం కాగా.. టీమిండియా బౌలర్లు తమ విజయానికి అవసరమైన ఒక్క వికెట్‌ను పడగొట్టలేకపోయారు. భారత ఫీల్డర్లు.. లేని పరుగులు ఇచ్చి, బౌండరీ వెళ్లేందుకు బంతికి దారి చూపి బంగ్లాదేశ్‌ విజయానికి దోహదపడ్డారు. 

కీలక సమయంలో (42.3వ ఓవర్‌లో, అప్పటికి బంగ్లాదేశ్‌ విజయానికి ఇంకా 32 పరుగులు (155/9) అవసరం ఉండింది) కేఎల్‌ రాహుల్‌.. మెహిది హసన్ క్యాచ్‌ జారవిడిచి టీమిండియా ఓటమికి ప్రధాన కారణం కాగా, ఆతర్వాతి బంతికి క్యాచ్‌ను పట్టుకునేందుకు కనీస ప్రయత్నం కూడా చేయని సుందర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు. అప్పటికే పలు బౌండరీలు వదిలేసిన సుందర్‌పై కోపంగా ఉన్న రోహిత్‌.. క్యాచ్‌కు కనీస ప్రయత్నం కూడా చేయకపోవడంతో సహనం ‍కోల్పోయి, బండ బూతులతో విరుచుకుపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియా ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా.. రాహుల్‌, సుందర్‌ ఇచ్చిన లైఫ్‌ల తర్వాత చెలరేగిపోయిన మెహిది హసన్.. ముస్తాఫిజుర్‌ సహకారంతో ఫోర్లు, సిక్సర్లు బాది బంగ్లాదేశ్‌ను గెలిపించాడు. 

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top