BGT 2023: ఆసీస్‌తో సిరీస్‌.. టీమిండియా క్రికెటర్‌ తండ్రి కన్నుమూత

Ind Vs Aus: Umesh Yadav Father Passed Away - Sakshi

నాగ్‌పూర్‌/ముంబై: టీమిండియా క్రికెటర్‌ ఉమేశ్‌ యాదవ్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఉమేశ్‌ తండ్రి తిలక్‌ యాదవ్‌(74) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. కానీ, పరిస్థితి విషమించడంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు

ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం కాపర్ఖెడాలోని మిలన్‌ చౌక్‌లో గల నివాసానికి తీసుకురాగా.. బుధవారం సాయంత్రం తిలక్‌ యాదవ్‌ తుదిశ్వాస విడిచారు. కాగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తిలక్‌ ఉద్యోగరీత్యా మహారాష్ట్రలో నాగ్‌పూర్‌లో స్థిరపడ్డారు. వాల్నీ కోల్‌ మైన్‌లో పని చేసి రిటైర్‌ అయ్యారాయన.

రెజ్లింగ్‌ పట్ల ఆయనకు అమితాసక్తి. అయితే, కొడుకును పోలీస్‌గా చూడాలని తిలక్‌ యాదవ్‌ భావించారు. అందుకు తగ్గట్లుగా ఉమేశ్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో క్రికెటర్‌ అవుతానని తండ్రిని ఒప్పించిన ఉమేశ్‌ యాదవ్‌.. టీమిండియా పేసర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం అతడు బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ ఆడుతున్న జట్టుతో ఉన్నాడు.

అయితే, తొలి రెండు మ్యాచ్‌లలోనూ అతడు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌లకు వరుస అవకాశాలు ఇచ్చిన మేనేజ్‌మెంట్‌ ఉమేశ్‌కు మొండిచేయి చూపింది. తదుపరి మ్యాచ్‌లలోనైనా తనకు ఆడే అవకాశం వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న ఉమేశ్‌కు.. ఇంతలోనే తండ్రి మరణించాడనే ఈ విషాదకర వార్త తెలిసింది. కాగా మార్చి 1 నుంచి ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఆరంభం కానుంది.

ఇక మొత్తంగా ఉమేశ్‌ యాదవ్‌ ఇప్పటి వరకు.. టీమిండియా తరఫున 54 టెస్టులాడి 164 వికెట్లు, 75 వన్డేల్లో 106 వికెట్లు, ఏడు టీ20 మ్యాచ్‌లతో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. కాగా గతేడాది చివరిసారిగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ ఆడాడు ఉమేశ్‌ యాదవ్‌.

చదవండి: IPL 2023: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొత్త సారధి పేరు ప్రకటన

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top