త్వరలోనే టీమిండియాలో నా ఎంట్రీ: ఐపీఎల్‌ స్టార్‌ | Sakshi
Sakshi News home page

త్వరలోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తా: ‘రాజస్తాన్‌ రాయల్స్‌’ స్టార్‌

Published Thu, May 30 2024 9:29 PM

Im Going To Play For India: RR Star Confident Of Donning Men In Blue Jersey

తాను త్వరలోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేయడం ఖాయమంటున్నాడు రియాన్‌ పరాగ్‌. సెలక్టర్లు ఏదో ఒకరోజు తనను జాతీయ జట్టుకు ఎంపిక చేయక తప్పదని.. ఈ విషయంలో పూర్తి నమ్మకంతో ఉన్నానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

అసోంకు చెందిన 22 ఏళ్ల బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ రియాన్‌ పరాగ్‌. కుడిచేతి వాటం కలిగిన బ్యాటర్‌ అయిన ఈ యంగ్‌స్టర్‌.. రైటార్మ్‌ లెగ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌ కూడా! ఐపీఎల్‌లో గత ఐదేళ్లుగా రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

అయితే, ఆరంభంలో నామమాత్రపు స్కోర్లకే పరిమితమై విమర్శలు ఎదుర్కొన్న రియాన్‌ పరాగ్‌ ఈ ఏడాది మాత్రం అద్భుతంగా రాణించాడు. దేశవాళీ క్రికెట్‌లో సూపర్‌ ఫామ్‌ అందుకున్న అతడు .. ఐపీఎల్‌-2024లోనూ దానిని కొనసాగించాడు.

రాజస్తాన్‌ తరఫున 14 ఇన్నింగ్స్‌ ఆడి ఏకంగా 573 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో విరాట్‌ కోహ్లి(741), రుతురాజ్‌ గైక్వాడ్‌(583) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.

సీజన్‌ ఆసాంతం మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుని రాజస్తాన్‌ను ప్లే ఆఫ్స్‌ చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు రియాన్‌ పరాగ్‌. ఇక దేశవాళీ క్రికెట్‌, ఐపీఎల్‌లోనూ పరుగుల వరద పారిస్తున్న ఈ అసోం ఆటగాడు త్వరలోనే టీమిండియాకు ఎంపిక కానున్నాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పీటీఐతో మాట్లాడిన రియాన్‌ పరాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఏదో ఒకరోజు వాళ్లు నన్ను సెలక్ట్‌ చేయక తప్పదు కదా! నేను టీమిండియాకు ఆడతాననే నమ్మకం నాకుంది.

ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా నేను లెక్కచేయను.నేను పరుగులు సాధించని సమయంలోనూ ఇదే తరహా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. నాపై నాకున్న నమ్మకం అది.

ఇదేమీ నేను అహంభావంతో చెబుతున్న మాట కాదు. పదేళ్ల వయసులో క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి మా నాన్న, నేను ఇదే అనుకున్నాం. ఏదేమైనా ఏదో ఒకరోజు కచ్చితంగా జాతీయ జట్టుకు ఆడటమే మా ధ్యేయం అని ఫిక్సైపోయాం’’ అని రియాన్‌ పరాగ్‌ ధీమా వ్యక్తం చేశాడు.

వచ్చే ఆరునెలల కాలంలో కచ్చితంగా టీమిండియా తరఫున తాను అరంగేట్రం చేసే అవకాశం ఉందని రియాన్‌ నమ్మకంగా చెప్పాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2024 తర్వాత టీమిండియా జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌ సందర్భంగా ఐపీఎల్‌-2024లో దుమ్ములేపిన రియాన్‌ పరాగ్‌, అభిషేక్‌ శర్మ, హర్షిత్‌ రాణా తదితరులు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టే ఛాన్స్‌ ఉంది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement