World Cup 2022: భారత్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. దక్షిణాఫ్రికాపై తప్పక గెలవాల్సిందే.. లేదంటే!

ICC Women World Cup Points Table : Bad NEWS for Indian Women, slips to NO 5 - Sakshi

ICC Women World Cup 2022: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టును దురదృష్టం వెంటాడింది. వర్షం కారణంగా వెస్టిండీస్‌- దక్షిణాఫ్రికా మ్యాచ్‌ రద్దు కావడంతో భారత్‌ సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. మ్యాచ్‌ రద్దు కావడంతో విండీస్‌- ప్రొటిస్‌ జట్లకు చెరో పాయింట్‌ లభించింది. దీంతో 9 పాయింట్లతో దక్షిణాఫ్రికా సెమీఫైనల్లో అడుగు పెట్టగా, విండీస్‌ 7 పాయింట్లతో మూడో స్ధానానికి చేరుకుంది.

ఇక భారత్‌ 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి పడిపోయింది. మరోవైపు పాకిస్తాన్‌పై ఘన విజయంతో ఇంగ్లండ్‌ నాలుగో స్ధానానికి చేరుకుంది. దీంతో భారత్‌కు దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి.

సెమీఫైనల్స్‌కు భారత్‌ అర్హత సాధించాలంటే 
ఆదివారం(మార్చి 27) జరుగనున్న తమ చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను భారత్ కచ్చితంగా ఓడించాలి. అప్పుడు 8 పాయింట్లతో భారత్‌ మూడో స్ధానానికి చేరుకుంటుంది. లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పదు. అదే విధంగా ఇంగ్లండ్ కూడా తమ చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధిస్తే మూడో  స్ధానానికి చేరుకునే అవకాశం ఉంది. అయితే ఇంగ్లండ్, భారత్‌ ఇరు జట్లు తమ చివరి మ్యాచ్‌లలో విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో టాప్‌ ఫోర్‌లో నిలుస్తాయి.

ఒకవేళ అనూహ్యంగా బంగ్లా చేతిలో ఇంగ్లండ్ ఓటమి చెంది, దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌ కూడా ఓటమి పాలైతే రన్‌రేట్‌ కీలకం కానుంది. మరోవైపు న్యూజిలాండ్‌ శనివారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ భారీ తేడాతో విజయం సాధిస్తే..  భారత్‌, ఇంగ్లండ్‌తో పోటీపడే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌ 4 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంలో ఉంది. 

చదవండి: World Cup Super League: దక్షిణాఫ్రికాపై సంచలన విజయం.. వరల్డ్‌కప్‌ సూపర్‌ లీగ్‌ టాప్‌లో బంగ్లాదేశ్‌! టీమిండియా ఎక్కడ?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top