Women WC 2022 Ind Vs Eng: నిరాశలో మిథాలీ సేన.. భారత్‌పై ఇంగ్లండ్‌ విజయం..

ICC Women ODI World Cup 2022 India Vs England Highlights in Telugu - Sakshi

England Women vs India Women Updatesమహిళల వన్డే ప్రపంచకప్‌-2022లో భాగంగా మిథాలీ సేనపై ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. సోఫీ ఎక్లెస్టోన్ ఫోర్‌ బాది ఇంగ్లండ్‌ విజయాన్ని ఖరారు చేసింది. కాగా వరల్డ్‌కప్‌-2022లో ఇంగ్లండ్‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం.

ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ స్కోర్లు:
ఇండియా- 134 (36.2ఓవర్లు)
ఇంగ్లండ్‌- 136/6 (31.2 ఓవర్లు)

11: 30 AM: ఆరో వికెట్‌ డౌన్‌
మేఘనా సింగ్‌ వరుసగా రెండో వికెట్‌ తీసింది. సోఫీ స్థానంలో క్రీజులోకి వచ్చిన బ్రంట్‌ను అవుట్‌ చేసింది.

11: 29 AM: ఐదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
సోఫీ డన్‌క్లేను మేఘనా సింగ్‌ పెవిలియన్‌కు పంపింది. దీంతో ఇంగ్లండ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది.

11: 17 AM
26 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ స్కోరు: 104-4

జోన్స్‌ రూపంలో నాలుగో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌

10: 53 AM: 20 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ స్కోరు: 80/3
విజయానికి ఇంకో 55 పరుగులు అవసరం

10: 48 AM: క్రీజులో నిలదొక్కుకున్న నటాలి సీవర్‌ను భారత ప్లేయర్‌ పూజా వస్త్రాకర్‌ పెవిలియన్‌కు పంపింది. అర్ధ శతకానికి చేరువైన నటాలిని అవుట్‌ చేసింది. దీంతో 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమె క్రీజును వీడింది. హైథర్‌నైట్‌, అమీ ఎలెన్‌ జోన్స్‌ క్రీజులో ఉన్నారు.

15 ఓవర్లలో ఇంగ్లండ్‌ 59/2
10:35 AM: ఆరంభంలో రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ మహిళల జట్టు 15 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. నటాటీ సివర్‌ 41, హెథర్‌ నైట్‌ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.

10:05 AM: 8 ఓవర్లలో ఇంగ్లండ్‌ 23/2
టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌  ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. హెథర్‌నైట్‌, నటాలి సీవర్‌ 11 పరుగులతో ఆడుతున్నారు.

9: 48 AM: రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌
భారత బౌలర్‌ మేఘనా సింగ్‌ భారత జట్టుకు శుభారంభం అందించింది. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ వ్యాట్‌ను ఒక్క పరుగుకే పెవిలియన్‌ చేర్చింది. దీంతో భారత్‌కు తొలి వికెట్‌ లభించింది. ఝులన్‌ గోస్వామి అద్భుత బంతితో ఇంగ్లండ్‌ మరో ఓపెనర్‌ టామీ బీమౌంట్‌ను పెవిలియన్‌కు చేర్చింది. 10 బంతులు ఎదుర్కొన్న బీమౌంట్‌ ఒకే ఒక్క పరుగు చేసి ఝులన్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. ఈ క్రమంలో 3 ఓవర్లలో 4 పరుగులు మాత్రమే సాధించిన ఇంగ్లండ్‌ రెండు వికెట్లు కోల్పోయింది. 

9: 00 PM: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2022లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత మహిళా జట్టు 134 పరుగులకు ఆలౌట్‌ అయింది. స్మృతి మంధాన(35), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(14), రిచా ఘోష్‌(33), ఝలన్‌ గోస్వామి(20) మినహా మిగతా వాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు.

8: 52 AM: తొమ్మిది వికెట్లు కోల్పోయిన భారత్‌
ఝులన్‌ గోస్వామి రూపంలో భారత్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. 20 పరుగులు చేసి ఝులన్‌ పెవిలియన్‌ చేరింది. రాజేశ్వరీ గైక్వాడ్‌, మేఘనా సింగ్‌ క్రీజులో ఉన్నారు.

8: 48 AM: ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన భారత్‌
బ్యాట్‌ ఝులిపిస్తూ భారత శిబిరంలో నిరాశను పోగొట్టిన రిచా ఘోష్‌ 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్‌ అయింది. దీంతో మిథాలీ సేన ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది.

8: 35 AM: రిచా ఘోష్‌, ఝులన్‌ గోస్వామి బ్యాటింగ్‌ చేస్తున్నారు.
31 ఓవర్లలో భారత్‌ స్కోరు: 108/7

8: 17 AM: ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్‌
పూజా వస్త్రాకర్‌(6 పరుగులు) రూపంలో భారత మహిళా జట్టు ఏడో వికెట్‌ కోల్పోయింది. చార్లెట్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. రిచా ఘోష్‌, ఝులన్‌ గోస్వామి క్రీజులో ఉన్నారు. భారత స్కోరు: 88-7

8: 03 AM: మంధాన అవుట్‌
వరుసగా వికెట్లు కోల్పోతున్న వేళ భారత జట్టు ఆశాకిరణంగా నిలిచిన స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన ఇన్నింగ్స్‌కు తెరపడింది. సోఫీ ఎక్లెస్టోన్ బౌలింగ్‌లో మంధాన ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. రిచా ఘోష్‌, పూజా వస్త్రాకర్‌ క్రీజులో ఉన్నారు. స్కోరు: 72-6

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. హర్మన్‌ స్థానంలో క్రీజులోకి వచ్చిన స్నేహ్‌ రాణా డకౌట్‌ అయింది. ఆమె రూపంలో భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. స్మతి మంధాన, రిచా ఘోష్‌ క్రీజులో ఉన్నారు.
స్కోరు: 64/5 (17.5)

7: 46 AM: నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్‌
ఇంగ్లండ్‌ బౌలర్‌ చార్లెట్‌ భారత్‌ జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టింది. క్రీజులో కుదురుకున్నట్లుగా అనిపించిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ను పెవిలియన్‌కు పంపింది. దీంతో భారత్‌ కీలక వికెట్‌ కోల్పోయింది.

7: 33 AM: నిలకడగా ఆడుతున్న స్మతి మంధాన
భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన(26 పరుగులు) నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. ఓవైపు వికెట్లు పడుతున్నా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేస్తోంది. మరో ఎండ్‌లో వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(12 పరుగులు) ఆమెకు చక్కటి సహకారం అందిస్తోంది.

కాగా మెగా టోర్నీలో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరు అద్భుత సెంచరీలు సాధించి భారత్‌కు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే.

7: 18 AM: మూడు వికెట్లు కోల్పోయిన భారత్‌
పది ఓవర్లు ముగిసేసరికి భారత్‌ స్కోరు- 37-3

దీప్తి రనౌట్‌
భారత జట్టుకు మరో షాక్‌ తగిలింది. బ్యాటర్‌ దీప్తి శర్మ రనౌట్‌గా వెనుదిరిగింది. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరింది.

ఏంటిది మిథాలీ!
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్‌ యస్తికా భాటికా నిరాశపరిచింది. 8 పరుగులకే నిష్క్రమించింది. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ సైతం మరోసారి విఫలమైంది. 5 బంతులు ఎదుర్కొన్న ఆమె ఒకే ఒక్క పరుగు చేసి వెనుదిరగడంతో భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది.

టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2022లో భాగంగా భారత మహిళా జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. మిథాలీ బృందాన్ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 

పంతం నీదా.. నాదా సై
సుమారు ఐదేళ్ల క్రితం... వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు చేరిన  భారత మహిళల జట్టును ఇంగ్లండ్‌ ఓడించింది. ఆఖరి వరకు అద్భుతంగా పోరాడినా...మిథాలీ సేన 9 పరుగులతో ఓడిపోకతప్పలేదు. దీంతో రన్నరప్‌గానే మిగిలిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రపంచకప్‌-2022లో మరోసారి ఇరు జట్లు తొలిసారిగా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.

అయితే, ఇంగ్లండ్‌లో పేరుకు గొప్ప ప్లేయర్లు ఉన్నా ప్రస్తుత ఈవెంట్‌లో జట్టుకు ఒక్క విజయం కూడా దక్కలేదు. ఈ మ్యాచ్‌లోనూ గనుక ఓడితే ఇంగ్లండ్‌ సెమీస్‌ దారులు దాదాపుగా మూసుకుపోయినట్లే. మరోవైపు.. గత మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై విజయంతో భారత్‌ ఆత్మవిశ్వాసంతో ఉంది. మరి ఈ ప్రతీకార మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top