
ఐసీసీ చైర్మన్ జై షా (PC: ICC)
టీ20 ప్రపంచకప్-2026 (T20 WC 2026) టోర్నమెంట్‌లో ఆడేందుకు ఇటీవలే ఇటలీ దేశపు జట్టు అర్హత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు పెరుగుతున్న ఆసక్తి, యూరోప్ దేశాల్లోనూ ఆట విస్తరిస్తున్న తీరుకు ఇది సరైన ఉదాహరణ. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఇప్పుడు సరిగ్గా దీనిపైనే మరింత దృష్టి పెట్టనుంది. కొత్త దేశాల్లో క్రికెట్‌ను మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కొత్త ప్రణాళికలు రూపొందించాలని ఐసీసీ భావిస్తోంది.
24 జట్లకు పెంచే ప్రతిపాదన
ఈ నేపథ్యంలో ఇదే అంశంపై మరింత సమగ్ర చర్చ, భవిష్యత్తు కార్యాచరణ విషయంలో ఐసీసీ చర్చించనుంది. గురువారం (జూలై 17) నుంచి నాలుగు రోజుల పాటు జరిగే ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో ప్రధాన ఎజెండాల్లో ఇది కూడా ఒకటి. వచ్చే టీ20 వరల్డ్ కప్ 20 జట్లతో జరగనుంది. దీనిని ఆ తర్వాత 24 జట్లకు పెంచే ప్రతిపాదనపై కూడా సమావేశంలో చర్చిస్తారు.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బోర్డుల మద్దతు
అమెరికా–వెస్టిండీస్‌లలో జరిగిన 2024 టీ20 వరల్డ్ కప్ నిర్వహణలో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ కొనసాగుతుండగా... విచారణలో వెల్లడైన అంశాలతో ఏజీఎంలో నివేదిక ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. టెస్టు క్రికెట్‌ను పెద్ద, చిన్న జట్లతో రెండు వేర్వేరు స్థాయిల్లో నిర్వహించే అంశంపై కూడా చర్చించనున్నారు. ఇలా టెస్టులను వర్గీకరించే అంశానికి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బోర్డులు గట్టిగా మద్దతు పలుకుతున్నాయి.
జాంబియా రీ ఎంట్రీ
తాజాగా ఆసీస్‌పై విండీస్ 27 ఆలౌట్ ప్రదర్శనను బట్టి చూస్తే దీనిపై గట్టిగానే చర్చ సాగనుంది. అయితే 2025–27 డబ్ల్యూటీసీ టెస్టుల షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఏదైనా మార్పుపై నిర్ణయం తీసుకుంటే 2027 తర్వాతే సాధ్యమవుతుంది.
మరో వైపు నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా 2019లో సస్పెన్షన్‌కు గురైన జాంబియా జట్టుకు ఐసీసీ అసోసియేట్ టీమ్‌గా మళ్లీ అవకాశం కల్పించనుండగా...తొలిసారి ఈస్ట్ తైమూర్ టీమ్ కూడా ఐసీసీలో భాగం కానుంది. ఐసీసీ కొత్త సీఈఓ హోదాలో సంజోగ్ గుప్తా తొలిసారి ఈ సమావేశంలో కీలక పాత్ర పోషించనున్నారు.