‘ఆ ఇద్దరితో ఎఫైర్‌.. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి’ | I Have Messages: Mary Kom Ex-Husband Sensational Allegations | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరితో ఎఫైర్‌.. సాక్ష్యాలు ఉన్నాయి: మాజీ భర్త సంచలన ఆరోపణలు

Jan 13 2026 3:44 PM | Updated on Jan 13 2026 3:55 PM

I Have Messages: Mary Kom Ex-Husband Sensational Allegations

భారత బాక్సింగ్‌ దిగ్గజం, లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత మేరీకోమ్‌పై ఆమె మాజీ భర్త కరుంగ్‌ ఓన్‌కోలర్‌ సంచలన ఆరోపణలు చేశాడు. మేరీ కోమ్‌కు పలువురితో వివాహేతర సంబంధాలు ఉండేవని ఆరోపించాడు. అదే విధంగా.. ఆస్తిని కాజేశానంటూ తనపై ఆమె చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదన్నాడు.

మణిపూర్‌కు చెందిన మేరీకోమ్ ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచారు. వ్యక్తిగత విషయానికొస్తే.. కరుంగ్‌ ఓన్‌కోలర్‌ను 2005లో వివాహం చేసుకున్నారు.‌ ఈ జంటకు ముగ్గురు మగ పిల్లలుకాగా... 2018లో కరుంగ్‌ ఓన్‌కోలర్‌ ఒక పాపను దత్తత తీసుకున్నాడు.

అయితే, 2023లో తమకు సంప్రదాయం (​కోమ్‌ చట్టాలు) ప్రకారం విడాకులు మంజూరు అయ్యాయని గతేడాది మేలో మేరీ కోమ్‌ ప్రకటించింది. అయితే, వీరిద్దరికి కోర్టు ద్వారా మాత్రం ఇంకా విడాకులు రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా IANSతో మాట్లాడిన కరుంగ్‌ ఓన్‌కోలర్‌ సంచలన ఆరోపణలతో ముందుకు వచ్చాడు.

జూనియర్‌ బాక్సర్‌తో
‘‘లోక్‌ అదాలత్‌లో నేను తనను మోసం చేశానని.. ఆస్తి కొట్టేశానని ఆమె చెబుతోందేమో!. మొదట 2013లో ఓ జూనియర్‌ బాక్సర్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఉండేది. ఈ విషయం తెలిసి మా కుటుంబాల మధ్య గొడవ జరిగింది. పెద్దలు చెప్పిన తర్వాత రాజీకి వచ్చాము.

వాట్సాప్‌ మెసేజులు ఉన్నాయి
2017 నుంచి మేరీ కోమ్‌ బాక్సింగ్‌ అకాడమీలో పని చేస్తున్న ఓ వ్యక్తితో ఆమె సంబంధం కొనసాగిస్తోంది. సాక్ష్యంగా వాళ్లిద్దరి వాట్సాప్‌ మెసేజులు నా దగ్గర ఉన్నాయి. ఆమెకు ఎవరితో సంబంధం ఉందో నాకు కచ్చితంగా తెలుసు. అయినా సరే నేను నిశ్శబ్దంగానే ఉన్నాను. ఆమె ఒంటరిగా బతుకుతూ.. అతడితో రిలేషన్‌షిప్‌లో ఉండాలనుకుంది.

అందుకే విడాకులు తీసుకున్నాం. ఒకవేళ తను వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నా నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నన్ను నిందిస్తే మాత్రం ఊరుకోను. ఆధారాలు ఉంటేనే నాపై ఆరోపణలు చేయాలి. పద్దెనెమిదేళ్ల వైవాహిక జీవితంలో నేను తన నుంచి ఏమీ తీసుకోలేదు.

కోర్టు నుంచి విడాకులు మంజూరు కాలేదు
ఆమె ఓ సెలబ్రిటీ. అయినా సరే నేను ఇప్పటికీ ఢిల్లీలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాను. తను చెప్పింది అందరూ వింటారు కాబట్టి నచ్చినట్లు మాట్లాడుతోంది. మేము సంప్రదాయం ప్రకారమే విడాకులు తీసుకున్నాం. కోర్టు నుంచి విడాకులు మంజూరు కాలేదు.

అయినా నేను కోర్టుకు వెళ్లను. నా పిల్లల గురించి ఆలోచిస్తున్నాను కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను తన డబ్బులు దొంగిలించానని.. రూ. 5 కోట్లు కొట్టేశానని అంటోంది. ఒక్కసారి నా అకౌంట్‌ చూడండి. నా దగ్గర ఎంత ఉందో తెలుస్తుంది.

నన్ను వాడుకొని వదిలేసింది
నన్ను వాడుకొని వదిలేసింది. ఆమె అకాడమీకి బీజం వేసింది నేను. కానీ ఇప్పుడు చైర్మన్‌గా ఎవరు ఉన్నారో చూడండి. ఆమె ప్రవర్తన నన్ను బాధపెట్టింది. నా పిల్లలు బోర్డింగ్‌ స్కూల్‌లో చదువుతున్నారు. ఆమె సంపాదిస్తోంది కాబట్టి.. వారి ఫీజులను చెల్లిస్తోంది. కానీ వాళ్లను పెంచింది నేను.

హాస్టల్‌లో ఉన్న నా పిల్లల్ని చూడనివ్వడం లేదు. వాళ్లు తన పిల్లలు అని వాదిస్తోంది. నిజానికి వాళ్లు నా రక్తం కూడా. భార్యాభర్తల బంధంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. నేను ఆల్కహాల్‌ తీసుకుంటానని తను చెబుతోంది. ఆమె కూడా వోడ్కా, రమ్‌ తాగుతుంది.

గుట్కా తింటుంది. అయినా సరే మీడియా ముందు నేను ఈ విషయాలు ఏమీ చెప్పలేదు. నేను పార్టీల్లో తాగినందుకు నా గురించి ప్రచారం చేసింది’’ అంటూ మేరీ కోమ్‌పై కరుంగ్‌ ఓన్‌కోలర్‌ సంచలన ఆరోపణలు చేశాడు. కాగా ఓ వ్యాపారవేత్తతో మేరీకి సంబంధం ఉందని వార్తలు రాగా.. ఆమె తరఫు లాయర్‌ ఈ ప్రచారాన్ని ఖండించారు. ఇకపై ఎవరూ వీటిని ప్రస్తావించకూడదని విజ్ఞప్తి చేశారు.

చదవండి: ‘నిశ్చితార్థం చేసుకున్నాం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement