బీసీసీఐ పెన్ష‌న్.. స‌చిన్‌, యువీకి ఎంతంటే? | How Much Pension Do Legends Like Sachin Tendulkar Get From BCCI | Sakshi
Sakshi News home page

బీసీసీఐ పెన్ష‌న్.. స‌చిన్‌, యువీ, కాంబ్లికి ఎంతంటే?

Jul 17 2025 4:57 PM | Updated on Jul 17 2025 5:32 PM

How Much Pension Do Legends Like Sachin Tendulkar Get From BCCI

భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండలి (బీసీసీఐ) ప్ర‌స్తుతం అమలు చేస్తున్న సెంట్ర‌ల్ కాంట్రాక్టుల గురించి అడిగితే క్రికెట్ ల‌వ‌ర్స్ ఈజీగా చెప్పేస్తారు. ఎన్ని గ్రేడులు ఉన్నాయ్‌, ఏ గ్రేడ్‌కు ఎంత జీతం వ‌స్తుంద‌నే వివ‌రాలు స‌గ‌టు క్రికెట్ అభిమానుల‌కు క‌ర‌త‌లామ‌ల‌కం. కానీ పెన్ష‌న్ గురించి అడిగి చూడండి.. చాలా త‌క్కువ మంది మాత్ర‌మే క‌రెక్ట్ స‌మాధానం చెప్ప‌గ‌లుగుతారు. రిటైర్ అయిన‌ మాజీ ఆట‌గాళ్లు, అంపైర్ల‌కు బీసీసీఐ ప్రతినెలా పెన్షన్ ఇస్తుంటుంది.

టీమిండియాకు అందించిన సేవ‌ల‌ను గుర్తించి వారికి కృతజ్ఞత తెలిపేందుకు, రిటైర్ అయిన త‌ర్వాత అండ‌గా నిలిచేందుకు పెన్షన్ పథకాన్ని బీసీసీఐ (BCCI) అమ‌లు చేస్తోంది. 2022, జూన్‌లో ఈ ప‌థ‌కాన్ని స‌వ‌రించ‌డంతో మాజీ ఆట‌గాళ్లు, అంపైర్ల‌కు పెన్ష‌న్ ద్వారా వ‌చ్చే మొత్తం గ‌ణ‌నీయంగా పెరిగింది. ఉన్నత శ్రేణి, దిగువ శ్రేణితో పాటు ఫ‌స్ట్‌క్లాస్ మాజీ ఆట‌గాళ్ల‌కు ఇచ్చే పెన్ష‌న్‌లో కూడా పెరుగుద‌ల చోటు చేసుకుంది.

అదే కొల‌మానం
టీమిండియా (Team India) త‌ర‌పు ఎన్ని మ్యాచ్‌లు ఆడారు, ఎన్నేళ్ల పాటు జ‌ట్టులో ఉన్నారనే అంశాల‌తో పాటు టెస్ట్ మ్యాచ్‌ల్లో జాతీయ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వహించాడా లేదా అనే దాని ఆధారంగా మూడు కేట‌గిరీలుగా బీసీసీఐ విభ‌జించింది. ఉన్న‌త శ్రేణిలో ఉన్న క్రికెట‌ర్ల‌కు నెల‌కు రూ. 70 వేలు, దిగువ శ్రేణిలోని వారికి రూ. 60 వేలు, ఫ‌స్ట్‌క్లాస్ మాజీ ఆట‌గాళ్ల‌కు రూ. 30 వేలు పెన్ష‌న్ అందిస్తోంది.

900 మందికి పెన్ష‌న్
సవరించిన పెన్షన్ పథకం ప్రస్తుతం దాదాపు 900 మంది రిటైర్డ్ క్రికెటర్లు, అంపైర్లకు ప్రయోజనం చేకూరుస్తోంది. 2022 సవరణ తర్వాత వారిలో దాదాపు 75% మంది పెన్షన్లలో 100% పెరుగుదల కనిపించింది. ఉన్న‌త శ్రేణి పెన్ష‌న్ అందుకుంటున్న వారిలో క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌తో పాటు ప‌లువురు మాజీ ఆట‌గాళ్లు ఉన్నారు. అంటే సచిన్‌కు బీసీసీఐ నుంచి ప్ర‌తినెల రూ. 70 వేలు పెన్ష‌న్ అందుతోంది. త‌క్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన యువ‌రాజ్ సింగ్ లాంటి ప్లేయ‌ర్లు దిగువ శ్రేణిలో ఉన్నారు. వీరికి నెల‌కు రూ.60 వేలు పెన్ష‌న్ వ‌స్తోంది. దేశ‌వాళీ క్రికెట్ ఎక్కువ ఆడిన వినోద్ కాంబ్లి (Vinod Kambli) ఫస్ట్-క్లాస్ కేటగిరీలో నెలకు రూ.30 వేలు పెన్ష‌న్ తీసుకుంటున్నాడు.

చ‌ద‌వండి: బీసీసీఐ నుంచి వ‌చ్చే నిధులు మ‌ళ్లించారు

విలువైన గుర్తింపు
సంప‌న్నులైన స‌చిన్, యువీ లాంటి స్టార్ ఆట‌గాళ్ల‌కు పెన్ష‌న్ అవ‌స‌ర‌మే లేదు. రిటైర్ అయిన త‌ర్వాత  కాంట్రాక్టులు, ఎండార్స్‌మెంట్‌ల ద్వారా ఇప్ప‌టికీ కోట్లు సంపాదిస్తున్నారు. అయితే బీసీసీఐ నుంచి పెన్ష‌న్ తీసుకోవ‌డం వారు గౌర‌వంగా భావిస్తున్నారు. త‌మ సేవ‌ల‌కు ద‌క్కిన విలువైన గుర్తింపుగా దీన్ని ప‌రిగ‌ణిస్తున్నారు. క్రీడా జీవితానికి ముగింపు ప‌లికిన ఎందరో ఆట‌గాళ్ల‌కు మ‌లి ద‌శ‌లో బీసీసీఐ ఇచ్చే పెన్ష‌న్ ఆద‌రువుగా నిలుస్తోంది. చివ‌రి రోజుల్లో గౌర‌ప్ర‌ద‌మైన జీవితం గ‌డిపేందుకు దోహదం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement