
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అక్రమాలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) మరోసారి సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయంపై కూడా విచారణ జరపాలని కోరింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పేర్లను సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో టీసీఏ ప్రస్తావించింది.
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు సీఐడీ అడిషనల్ డీజీ చారుసిన్హాను కలిశారు. ఈ సందర్భంగా.. హెచ్‌సీఏ అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని టీసీఏ ఆరోపించింది. జగన్మోహన్‌రావుతో పాటు మరికొందరు అక్రమార్కులు కూడా ఉన్నారని.. వాళ్లపై కూడా దర్యాప్తు చేయాలని కోరింది. జాన్ మనోజ్, విజయానంద్, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్, వంకా ప్రతాప్‌లపై కూడా టీసీఏ ఫిర్యాదు చేసింది.
కేటీఆర్, కవిత, హరీష్ రావుకి అంకితం
‘‘HCA ఎన్నికల్లోకి హఠాత్తుగా జగన్మోహన్ రావు రావడం వెనక కేటీఆర్, కవిత హస్తం ఉంది. క్రికెట్ కి సంబంధం లేని ఈ ఇద్దరూ.. జగన్మోహన్ వెంట ఉండి నడిపించారు. HCA ప్రెసిడెంట్ గా జగన్మోహన్ రావు గెలవగానే.. నా విజయం కేటీఆర్, కవిత, హరీష్ రావుకి అంకితం అని చెప్పాడు. అతడి వెనక ఉన్న వాళ్ళ పాత్ర కూడా నిగ్గు తేల్చాలి అని CID కి ఫిర్యాదు చేశాం. HCA లో మరికొందరు అక్రమార్కులు ఉన్నారు.. వీళ్లపై కూడా దర్యాప్తు చేయాలని కోరాం’’ అని ఫిర్యాదు చేసిన సందర్భంగా టీసీఏ పేర్కొంది.
బీసీసీఐ నుంచి వచ్చే నిధులు మళ్లించారు
ఇక టీసీఏ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. ‘‘క్రికెట్ నిధులను ఎవరు వాడుకున్నారు. అక్రమాలకు పాల్పడిన జగన్మోహన్ రావుకు పడిన శిక్ష రాజకీయ నాయకులకూ పడాలి. జగన్మోహన్ రావు గెలిచిన తర్వాత ఎవరికి అంకితం చేశాడో ఆ వీడియోలు సీఐడీ కి పిర్యాదు చేశాం’’ అని తెలిపారు. కాగా బీసీసీఐ నుంచి వచ్చే కోట్లాది రూపాయల నిధులను మళ్లించారని ఆరోపించిన టీసీఏ.. మనీలాండరింగ్ కోణంలో విచారణ జరపాలని ఈడీకి కూడా ఫిర్యాదు చేసింది.
కాగా.. హెచ్‌సీఏ- ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ వివాదం నేపథ్యంలో అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావును సీఐడీ ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈఓ సునీల్ కంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితలను కూడా అరెస్టు చేశారు. ఈ క్రమంలో జగన్మోహన్ రావు అక్రమ పద్ధతిలో హెచ్‌సీఏలోకి ప్రవేశించినట్లు సీఐడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో మల్కాజిగిరీ కోర్టు నిందితులకు పన్నెండు రోజుల రిమాండ్ విధించింది.