
Photo Courtesy: BCCI/IPL
ఐపీఎల్-2025(IPL 2025) ప్లే ఆఫ్స్ దశలో పలు ఫ్రాంఛైజీలలోకి కొత్త ఆటగాళ్లు చేరారు. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో లీగ్ వారం పాటు వాయిదా పడటంతో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాకు చెందిన కొందరు ఆటగాళ్లు అందుబాటులో లేకుండా పోయారు. మరికొంత మంది గాయాలు, ఫిట్‌నెస్ లేమి కారణంగా దూరమయ్యారు. ఈ క్రమంలో ఫ్రాంఛైజీలు కొత్త ప్లేయర్లతో వీరి స్థానాలను భర్తీ చేశాయి.
ఇందులో భాగంగా ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్రాంఛైజీ కొత్తగా ముగ్గురు విదేశీ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. ఈ నెల 26 తర్వాత జాతీయ జట్టుకు అందుబాటులో ఉండేందుకు ముగ్గురు విదేశీ ఆటగాళ్లు ముంబై జట్టును వీడుతుండటంతో... ఫ్రాంఛైజీ వారి స్థానాలను మరో ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో భర్తీ చేసుకుంది. ఇంగ్లండ్ ప్లేయర్లు జానీ బెయిర్‌స్టో, రిచర్డ్ గ్లీసన్‌తో పాటు శ్రీలంక ఆటగాడు చరిత అసలంకలను జట్టులోకి తీసుకుంది.

రూ.5.25 కోట్లు
బెయిర్ స్టోతో రూ. రూ.5.25 కోట్లకు, గ్లీసన్‌తో రూ. కోటికి, అసలంకతో రూ. 75 లక్షలతో ఒప్పందం కుదుర్చుకుంది. మిగిలిన రెండు- మూడు మ్యాచ్‌ల కోసమే ముంబై వీరికి పెద్ద మొత్తంలో చెల్లిస్తోందని.. తద్వారా ముంబైతో పాటు కొత్త ఆటగాళ్లతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఫ్రాంఛైజీలపై అదనపు భారం పడుతోందనే వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు.
తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘కేవలం ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల కోసం ముంబై జానీ బెయిర్‌స్టో, రిచర్డ్ గ్లీసన్, చరిత్ అసలంకలను తీసుకుంది.. ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి ముస్తాఫిజుర్ రహ్మమాన్ కూడా వచ్చాడు.. ఇక ఆర్సీబీ లుంగి ఎంగిడి స్థానంలో బ్లెస్సింగ్ ముజర్‌బానీని తీసుకుంది.
ఆడిన మ్యాచ్‌లను బట్టి
మరి వీళ్లకు ఎంత డబ్బు చెల్లిస్తారని మీరు అనుకుంటున్నారు? చాలా మంది సోషల్ మీడియాలో ఓ నకిలీ వార్తను ప్రచారం చేస్తున్నారు. ఐపీఎల్‌లో బెయిర్‌స్టో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడని చెబుతున్నారు.
కేవలం మూడు మ్యాచ్‌లకే రూ. 5.25 కోట్లు పొందుతున్నాడని అంటున్నారు. ఈ క్రమంలో రిషభ్ పంత్ (రూ. 27 కోట్లు) పేరును కూడా ప్రస్తావిస్తున్నారు. మీరన్నట్లు ఫ్రాంఛైజీలు వారితో ఆ ధరకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ ప్రొ-రెటా ఆధారంగా మాత్రమే వారికి డబ్బు చెల్లిస్తారు. అంటే.. అందుబాటులో ఉ న్న, ఆడిన మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా మాత్రమే ఫీజు ముట్టజెప్పుతారు’’ అని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు.
ఢిల్లీతో అమీతుమీ
కాగా ప్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకునేందుకు తహతహలాడుతున్న ముంబై జట్టు... పాయింట్ల పట్టికలో తుది నాలుగు స్థానాల్లో నిలిస్తేనే ఈ ముగ్గురు ఆటగాళ్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం మ్యాచ్ ఆడనున్న ముంబై.. ఈ నెల 26న పంజాబ్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది.
ఆ తర్వాతే ఈ ముగ్గురు జట్టుతో కలవనున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన రికెల్టన్, కార్బిన్ బాష్... ఇంగ్లండ్ ప్లేయర్ విల్ జాక్స్ ఈనెల 26 తర్వాత ముంబై జట్టును వీడనున్నారు. ‘జాక్ స్థానాన్ని ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెయిర్‌స్టో భర్తీచేస్తాడు. అతడిని రూ. 5 కోట్ల 25 లక్షలకు ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసుకుంది.
కాగా రికెల్టన్ స్థానంలో జట్టులోకి తీసుకున్న ఇంగ్లండ్ పేసర్ రిచర్డ్ గ్లీసన్‌కు 1 కోటి రూపాయాలు... శ్రీలంక బ్యాటర్ అసలంకను రూ. 75 లక్షలు అందజేస్తారు’ అని ఐపీఎల్ పాలక మండలి ఒక ప్రకటనలో తెలిపింది.
చదవండి: ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్‌కే కెప్టెన్ రియాక్షన్ వైరల్