
ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్(Harry Brook) సత్తాచాటాడు. ఐసీసీ ప్రకటించిన తాజాగా ర్యాకింగ్స్‌లలో బ్రూక్ తన సహచరుడు జో రూట్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ 886 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.
అతడి తర్వాతి స్దానంలో జో రూట్ 868 పాయింట్లతో ఉన్నాడు. భారత్‌తో ఇటీవల ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బ్రూక్(158) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. అంతకుముందు తొలి టెస్టులోనూ బ్రూక్ రాణించాడు. ఈ క్రమంలోనే వరల్డ్ నెం1 టెస్టు బ్యాటర్‌గా అతడు అవతరించాడు.
టాప్-10లో శుబ్‌మన్ గిల్..
ఇక ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఇంగ్లండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (269), రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం (161) సాధించిన టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సైతం తాజా ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. గిల్ 807 పాయింట్లతో ఏకంగా 15 స్థానాలు మెరుగుపరచుకుని తన కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్ ఆరో స్థానానికి చేరుకున్నాడు.
ఇక గిల్‌తో పాటు మరో ఇద్దరు బ్యాటర్లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ నాలుగో స్ధానంలో ఉండగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఎనిమిదవ స్దానంలో నిలిచాడు. మరోవైపు భారత్‌తో రెండో టెస్టులో సత్తాచాటిన ఇంగ్లండ్ కీపర్ జెమీ స్మిత్ 753 పాయింట్లతో 16 స్థానాలు ఎగబాకి పదో స్థానానికి చేరుకున్నాడు.
టాప్‌లోనే బుమ్రా..
అయితే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(898) టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. సఫారీ పేసర్ కగిసో రబాడ(851) రెండో స్ధానంలో ఉన్నాడు. మరోవైపు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా అగ్రస్దానంలో కొనసాగుతున్నాడు.
చదవండి: ENG VS IND 3rd Test: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో రిషబ్ పంత్