Gukesh Dommaraju: అతను.. ఒత్తిడిని అధిగమించే 'ఎత్తులమారి'! | Sakshi
Sakshi News home page

Gukesh Dommaraju: అతను.. ఒత్తిడిని అధిగమించే 'ఎత్తులమారి'!

Published Sun, May 5 2024 8:44 AM

Gukesh Youngest Ever To Win Candidates Tournament Tan Wins Success Story

30 నవంబర్, 2017.. అండర్‌–11 జాతీయ చాంపియన్‌గా నిలిచిన అబ్బాయిని ‘నీ లక్ష్యం ఏమిటి?’ అని ప్రశ్నిస్తే.. ‘చెస్‌లో ప్రపంచ చాంపియన్‌ కావడమే’ అని సమాధానమిచ్చాడు. సాధారణంగా ఆ స్థాయిలో గెలిచే ఏ పిల్లాడైనా అలాంటి జవాబే చెబుతాడు. అతను కూడా తన వయసుకు తగినట్లుగా అదే మాట అన్నాడు. కానీ ఆరున్నరేళ్ల తర్వాత చూస్తే అతను వరల్డ్‌ చాంపియన్‌ కావడానికి మరో అడుగు దూరంలో నిలిచాడు. ఆ కుర్రాడిలోని ప్రత్యేక ప్రతిభే ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చింది.

పిన్న వయసులో భారత గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందడం మొదలు వరుస విజయాలతో వరల్డ్‌ చాంపియన్‌కు సవాల్‌ విసిరే చాలెంజర్‌గా నిలిచే వరకు అతను తన స్థాయిని పెంచుకున్నాడు. ఆ కుర్రాడి పేరే దొమ్మరాజు గుకేశ్‌. చెన్నైకి చెందిన ఈ కుర్రాడు ఇటీవలే ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో చాంపియన్‌గా నిలిచి తానేంటో నిరూపించుకున్నాడు. తనకంటే ఎంతో బలమైన, అనుభవజ్ఞులైన గ్రాండ్‌మాస్టర్లతో తలపడి అతను ఈ అసాధారణ ఘనతను సాధించాడు.

క్యాండిడేట్స్‌తో విజేతగా నిలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా రికార్డు నమోదు చేశాడు. ఈ ఏడాది చివర్లో.. చైనా ఆటగాడు డింగ్‌ లారెన్‌తో జరిగే పోరులోనూ గెలిస్తే అతను కొత్త జగజ్జేత అవుతాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 37 ఏళ్లుగా భారత నంబర్‌వన్‌గా ఉన్న దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్‌ ఆనంద్‌ను దాటి మన దేశం తరఫున అగ్రస్థానాన్ని అందుకున్నప్పుడే గుకేశ్‌ ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు అదే జోరులో సాధించిన తాజా విజయంతో ఈ టీనేజర్‌ చెస్‌ చరిత్రలో తనకంటూ కొత్త అధ్యాయాన్ని లిఖించుకున్నాడు.

‘త్యాగం’.. తనకు నచ్చని పదం అంటారు గుకేశ్‌ తండ్రి రజినీకాంత్‌. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే అనుబంధానికి త్యాగం అనే మాటను జోడించడం సరైంది కాదనేది ఆయన అభిప్రాయం. గుకేశ్‌ క్యాండిడేట్స్‌ టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత అతని కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారని, వారు త్యాగాలు చేశారని చెబుతుంటే ఆయనలా స్పందించారు. చెన్నైలో స్థిరపడిన తెలుగువారు ఆయన. రజినీకాంత్‌ ఈఎన్‌టీ వైద్యుడు కాగా, గుకేశ్‌ తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్‌గా ఒక ఆస్పత్రిలో పని చేస్తున్నారు. గుకేశ్‌తో పాటు టోర్నీల కోసం ప్రయాణించేందుకు ఆయన చాలాసార్లు తన వృత్తిని పక్కన పెట్టి మరీ కొడుకు కోసం సమయం కేటాయించాల్సి వచ్చిందనేది వాస్తవం.

‘పిల్లలను పోషించడం తల్లిదండ్రుల బాధ్యత. వారి పిల్లలు అభివృద్ధిలోకి వచ్చేలా పేరెంట్స్‌ కాక ఇంకెవరు శ్రమపడతారు! నేను గుకేశ్‌లో ప్రతిభను గుర్తించాను. అందుకు కొంత సమయం పట్టింది. ఒక్కసారి అది తెలిసిన తర్వాత అన్ని రకాలుగా అండగా నిలిచాం. నాకు టెన్నిస్‌ అంటే పిచ్చి. దాంతో మా అబ్బాయిని అందులోనే చేర్పిద్దాం అనుకున్నాను. కానీ బాబు చెస్‌లో ఆసక్తి చూపిస్తున్నాడని నా భార్య చెప్పింది.

ప్రధాని మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో..

అంతే.. ప్రోత్సహించేందుకు మేం సిద్ధమైపోయాం. చెన్నై చుట్టుపక్కల ఎన్ని టోర్నీలు జరుగుతాయి, ఎలాంటి శిక్షణావకాశాలు ఉన్నాయి, వేరే నగరాలకు వెళ్లి ఎలా ఆడాలి.. ఇలా అన్నీ తెలుసుకున్నాం.. ప్రోత్సహించాం.. అబ్బాయి చదరంగ ప్రస్థానం మొదలైంది’ అని రజినీకాంత్‌ అన్నారు. గుకేశ్‌ క్యాండిడేట్స్‌ గెలిచిన సమయంలో అతని పక్కనే ఉన్న ఆ తండ్రి ఆనందం గురించి వర్ణించేందుకు మాటలు సరిపోవు. విజయానంతరం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పుడు గుకేశ్‌ను హత్తుకొని తల్లి కళ్లు చెమర్చాయి.

అంచనాలకు అందకుండా రాణించి..
కొన్నాళ్ల క్రితం వరకు కూడా క్యాండిడేట్స్‌ టోర్నీకి గుకేశ్‌ అర్హత సాధించడం సందేహంగానే కనిపించింది. వరుసగా కొన్ని అనూహ్య పరాజయాలతో అతను వెనకబడ్డాడు. చివరకు చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ టోర్నీ గెలవడంతో అతనికి అవకాశం దక్కింది. అయితే టోర్నీకి ముందు.. గుకేశ్‌ గెలవడం కష్టమంటూ చెస్‌ దిగ్గజం మాగ్నస్‌ కార్ల్‌సన్‌ చేసిన వ్యాఖ్య తనపై కాస్త సందేహాన్ని రేకెత్తించింది. అంచనాలు అన్నీ నిజం కావు కానీ కార్ల్‌సన్‌ చెప్పడంతో మనసులో ఎక్కడో ఒక మూల కాస్త సంశయం.

సాధారణంగా గుకేశ్‌ టోర్నీలు ఆడే సమయంలో ప్రతి రోజూ రెండుసార్లు తన తల్లికి ఫోన్‌ చేసేవాడు. గేమ్‌ ఓడినప్పుడైతే ఇంకా ఎక్కువసేపు మాట్లాడాలని కోరేవాడు. అప్పుడా అమ్మ.. తన కొడుకుకి.. క్రీడల్లో పరాజయాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో మళ్లీ సత్తా చాటి పైకెగసిన పలువురు దిగ్గజ క్రీడాకారుల గురించి చెబుతూ  స్ఫూర్తినింపేది. ఆ ప్రయత్నం ఇటీవల రెండు సార్లు ఫలితాన్నిచ్చింది. క్యాండిడేట్స్‌కు అర్హత సాధించడానికి ముందు ఓటములు ఎదురైనప్పుడు మళ్లీ అతను ఆత్మవిశ్వాసం సాధించి పట్టుదలగా బరిలోకి దిగేందుకు ఇది ఉపకరించింది.

రెండోసారి ఈ  మెగా టోర్నీలో ఏడో రౌండ్‌లో అలీ రెజా చేతిలో ఓటమి తర్వాత అమ్మ మాటలు మళ్లీ ప్రభావవంతంగా పనిచేశాయి. గుకేశ్‌ స్వయంగా చెప్పినట్లు ఆ ఓటమే తన విజయానికి టర్నింగ్‌ పాయింట్‌గా మారింది. క్యాండిడేట్స్‌ టోర్నీ 14 రౌండ్‌లలో ఈ ఒక్క గేమ్‌లోనే ఓడిన అతను ఆ తర్వాత తిరుగులేకుండా దూసుకుపోయాడు. గుకేశ్‌ వాళ్లమ్మ మాటల్లో చెప్పాలంటే.. గతంలో టోర్నీలో ఒక మ్యాచ్‌ ఓడితే ఆ తర్వాతి రౌండ్‌లలో అతని ఆట మరింత దిగజారేది. పూర్తిగా కుప్పకూలిపోయేవాడు. కానీ ఇప్పుడు గుకేశ్‌ ఎంతో మారిపోయాడు. నిజానికి 17 ఏళ్ల వయసులో ఇంత పరిపక్వత అంత సులువుగా రాదు. ఒక ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని మళ్లీ సమరోత్సాహంతో బరిలోకి దిగడాన్ని అతను నేర్చుకున్నాడు.

ఆత్మవిశ్వాసంతో..
గుకేశ్‌ గతంలో ఏ ప్రశ్ననైనా అవును, కాదు అంటూ రెండేరెండు జవాబులతో ముగించేవాడు. కానీ ఇప్పుడు విజయాలు తెచ్చిన ఆత్మవిశ్వాసం అతని వ్యక్తిత్వంలోనూ ఎంతో మార్పు తెచ్చింది. క్యాండిడేట్స్‌కు అర్హత సాధించడానికి ముందు అతనికి 24 గంటలూ చెస్‌ ధ్యాసే. మరో జీవితమే లేకుండా పోయింది. కానీ టోర్నీ సన్నాహకాల్లో భాగంగా అతను చెస్‌తో పాటు ఇతర అంశాల్లో కూడా సమయం వెచ్చించాడు. యోగా, టెన్నిస్‌ ఆడటం, సినిమాలు, మిత్రులను కలవడం, తగినంత విశ్రాంతి.. ఇలా అన్ని రకాలుగా అతను తనను తాను మలచుకున్నాడు. ఈ కీలక మార్పు కూడా అతని విజయానికి ఒక కారణమైంది.

తల్లిదండ్రులతో..

ఒత్తిడిని అధిగమించి..
గుకేశ్‌కు ఇది తొలి క్యాండిడేట్స్‌ టోర్నీ. ఈ టోర్నీలో అతను అందరికంటే చిన్నవాడు కూడా. ప్రత్యర్థుల్లో కొందరు నాలుగు లేదా ఐదుసార్లు ఈ టోర్నమెంట్‌లో ఆడారు. రెండుసార్లు విజేతైన ఇవాన్‌ నెపొమినియాచి కూడా ఉన్నాడు. కానీ వీరందరితో పోలిస్తే గుకేశ్‌ ఒత్తిడిని సమర్థంగా అధిగమించాడు. పైగా ఇందులో రెండో స్థానం వంటి మాటకు చాన్స్‌ లేదు. అక్కడ ఉండేది ఒకే ఒక్క విజేత మాత్రమే.

‘టొరంటోకు నేను ఒకే ఒక లక్ష్యంతో వెళ్లాను. టైటిల్‌ గెలవడం ఒక్కటే నాకు కావాల్సింది. ఇది అంత సులువు కాదని నాకు తెలుసు. నా వైపు నుంచి చాలా బాగా ఆడాలని పట్టుదలగా ఉన్నాను. ప్రత్యర్థులతో పోలిస్తే నా ఆటలో కూడా ఎలాంటి లోపాలు లేవనిపించింది. అందుకే నన్ను నేను నమ్మాను’ అని గుకేశ్‌ చెప్పాడు. అయితే గుకేశ్‌ తల్లిదండ్రులు మాత్రం అతని విజయంపై అతిగా అంచనాలు పెట్టుకోలేదు. ఇక్కడి అనుభవం.. వచ్చే క్యాండిడేట్స్‌ టోర్నీకి పనికొస్తే చాలు అని మాత్రమే తండ్రి అనుకున్నారు. కానీ వారి టీనేజ్‌ అబ్బాయి తల్లిదండ్రుల అంచనాలను తారుమారు చేశాడు.

అండర్‌ 12 వరల్డ్‌ చాంపియన్‌గా.. , క్యాండిడేట్స్‌ టోర్నీ గోల్డ్‌ మెడల్‌తో.. 

సవాల్‌కు సిద్ధం..
గుకేశ్‌ ఐదేళ్ల క్రితం 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయసులో గ్రాండ్‌మాస్టర్‌ హోదా సాధించి ఆ ఘనతను అందుకున్న రెండో అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. దానికే పరిమితం కాకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ జూనియర్‌ నుంచి సీనియర్‌ స్థాయి వరకు సరైన రీతిలో పురోగతి సాధిస్తూ వరుస విజయాలు అందుకున్నాడు.

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా 8వ స్థానానికి చేరిన అతను 2700 ఎలో రేటింగ్‌ (ప్రస్తుతం 2743) దాటిన అరుదైన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. వేర్వేరు వ్యక్తిగత టోర్నీలు గెలవడంతో పాటు ఆసియా క్రీడల్లో భారత జట్టు రజతం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 2022లో జరిగిన చెస్‌ ఒలింపియాడ్‌లో తొలి 8 గేమ్‌లలో ఎనిమిదీ గెలిచి ఎవరూ సాధించని అరుదైన రికార్డును సాధించాడు. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ కోసం ప్రస్తుత విజేత, చైనాకు చెందిన డింగ్‌ లారెన్‌తో గుకేశ్‌ తలపడతాడు.

31 ఏళ్ల డింగ్‌కు మంచి అనుభవం ఉంది. 2800 రేటింగ్‌ దాటిన ఘనత పొందిన అతను చైనా చెస్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాడు. ఒక దశలో వరుసగా 100 గేమ్‌లలో ఓటమి ఎరుగని రికార్డు అతనిది. అయితే ఇప్పుడు గుకేశ్‌ చూపిస్తున్న ఆట, ఆత్మవిశ్వాసం, సాధన కలగలిస్తే డింగ్‌ని ఓడించడం అసాధ్యమేమీ కాదు. — మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది

Advertisement
 
Advertisement
 
Advertisement