టీమిండియాలో గుజరాతీ క్రికెటర్ల హవా.. ఒకప్పటి కర్ణాటకలా..!

Gujarat Cricketers Domination In Team India - Sakshi

క్రికెట్‌ తొలినాళ్లలో భారత జట్టు మహారాష్ట్ర క్రికెటర్లతో, ప్రత్యేకించి ముంబై క్రికెటర్లతో నిండి ఉండేదన్నది జగమెరిగిన సత్యం. రుస్తొంజీ జంషెడ్‌జీ, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌, గులాబ్‌రాయ్‌ రాంచంద్‌, ఏక్‌నాథ్‌ సోల్కర్‌, బాపు నాదకర్ణి, ఫరూక్‌ ఇంజనీర్‌, దిలీప్‌ సర్దేశాయ్‌, పోలీ ఉమ్రిగర్‌.. ఆతర్వాత 70,80 దశకాల్లో అజిత్‌ వాడేకర్‌, సునీల్‌ గవాస్కర్‌, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, బల్విందర్‌ సంధూ, రవిశాస్త్రి.. 90వ దశకంలో సంజయ్‌ మంజ్రేకర్‌, సచిన్‌ టెండూల్కర్‌, వినోద్‌ కాంబ్లీ.. 2000 సంవత్సరానికి ముందు ఆతర్వాత జహీర్‌ ఖాన్‌, అజిత్‌ అగార్కర్‌, వసీం జాఫర్‌, రోహిత్‌ శర్మ, అజింక్య రహానే, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌.. ఇలా దశకానికి కొందరు చొప్పున టీమిండియా తరఫున మెరుపులు మెరిపించారు. వీరిలో గవాస్కర్‌, సచిన్‌, రోహిత్‌ శర్మ లాంటి ప్లేయర్లు విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని దిగ్గజ హోదా పొందారు. 

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. భారత క్రికెట్‌కు మహారాష్ట్ర కాంట్రిబ్యూషన్‌ క్రమంగా తగ్గుతూ వచ్చింది. క్రికెట్‌ తొలినాళ్లలో భారత జట్టులో సగం ఉన్న మహా క్రికెటర్ల సంఖ్య రానురాను ఒకటి, రెండుకు పరిమితమైంది. మహారాష్ట్ర తర్వాత టీమిండియాకు అత్యధిక మంది క్రికెటర్లను అందించిన ఘనత ఢిల్లీకి దక్కుతుంది. దేశ రాజధాని ప్రాంతం నుంచి మోహిందర్‌ అమర్‌నాథ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌, శిఖర్‌ ధవన్‌, విరాట్‌ కోహ్లి లాంటి ప్లేయర్లు టీమిండియా తరఫున మెరిశారు. వీరిలో కోహ్లి విశ్వవ్యాప్తంగా పాపులారిటీ పొంది క్రికెట్‌ దిగ్గజంగా కొనసాగుతున్నాడు.

మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత టీమిండియాకు అత్యధిక మంది స్టార్‌ క్రికెటర్లను అందించిన రాష్ట్రంగా కర్ణాటక గుర్తింపు పొందింది. 90వ దశకంలో ప్రత్యేకించి 1996వ సంవత్సరంలో టీమిండియాలో కర్ణాటక ప్లేయర్ల హవా కొనసాగింది. ఆ ఏడాది ఒకానొక సందర్భంలో ఏడుగురు కర్ణాటక ఆటగాళ్లు టీమిండియాలో ఉన్నారు. రాహుల్‌ ద్రవిడ్‌, అనిల్‌ కుంబ్లే, జవగల్‌ శ్రీనాథ్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌, సునీల్‌ జోషి, దొడ్డ గణేష్‌, డేవిడ్‌ జాన్సన్‌ టీమిండియాకు ఒకే మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వహించారు. 1996-2004, 2005 వరకు టీమిండియాలో కర్ణాటక ఆటగాళ్ల డామినేషన్‌ కొనసాగింది. 

ప్రస్తుతం అదే హవాను గుజరాత్‌ ఆటగాళ్లు కొనసాగిస్తున్నారు. ఒకానొక సందర్భంలో కర్ణాటక ఆటగాళ్లు సగానికిపై టీమిండియాను ఆక్రమిస్తే.. ఇంచుమించు అదే రేంజ్‌లో ప్రస్తుతం గుజరాతీ ఆటగాళ్ల డామినేషన్‌ నడుస్తోంది. ప్రస్తుత భారత జట్టులో స్టార్‌ ఆల్‌రౌండర్లైన రవీంద్ర జడేజా, హార్ధిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌.. టెస్ట్‌ స్టార్‌ బ్యాటర్‌, నయా వాల్‌ చతేశ్వర్‌ పుజారా, ప్రస్తుతం రెస్ట్‌లో ఉన్న టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా, లిమిటెడ్‌ ఓవర్స్‌ స్పెషలిస్ట్‌ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌, లేటు వయసులో సంచలన ప్రదర్శనలతో టీమిండియా తలుపు తట్టిన వెటరన్‌ పేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ గుజరాత్‌ ప్రాంతవాసులే.

వీరిలో కొందరు దేశావాలీ టోర్నీల్లో సౌరాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ, ఆ ప్రాంతం గుజరాత్‌ కిందకే వస్తుంది. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023 కోసం, ఆతర్వాత ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్‌ కోసం తాజాగా ఎంపిక చేసిన భారత జట్టును ఓసారి పరిశీలిస్తే.. టెస్ట్‌ జట్టులో నలుగురు (పుజారా, జడేజా, అక్షర్‌, ఉనద్కత్‌), వన్డే జట్టులో నలుగురు (హార్ధిక్‌ పాండ్యా, జడేజా, అక్షర్‌, ఉనద్కత్‌) గుజరాతీ ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో హార్ధిక్‌ టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కాగా.. మిగతా ముగ్గురు స్టార్‌ క్రికెటర్ల హోదా కలిగి ఉన్నారు. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top