
బుకారెస్ట్: గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా నిర్వహించిన సూపర్‌బెట్ క్లాసిక్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద చాంపియన్‌గా అవతరించాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరిగింది. నిర్ణిత తొమ్మిది రౌండ్ల తర్వాత ప్రజ్ఞానంద, మాక్సిమి లాగ్రెవ్ (ఫ్రాన్స్), అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్) 5.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.
దాంతో విజేతను నిర్ణయించేందుకు వీరిద్దరి మధ్య టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. అలీరెజాతో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న ప్రజ్ఞానంద.. లాగ్రెవ్‌పై గెలిచి 1.5 పాయింట్లతో టైటిల్‌ను ఖరారు చేసుకున్నాడు. విజేత ప్రజ్ఞానందకు 77,667 డాలర్లు (రూ. 66 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ నాలుగు పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు.