గాయత్రి–ట్రెసా జోడీ మరో సంచలనం | Gayatri and Teresa pair is another sensation | Sakshi
Sakshi News home page

గాయత్రి–ట్రెసా జోడీ మరో సంచలనం

Jun 1 2024 4:18 AM | Updated on Jun 1 2024 4:18 AM

Gayatri and Teresa pair is another sensation

ప్రపంచ ఆరో ర్యాంకర్‌ జంటపై విజయం

సింగపూర్‌ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి 

సింగపూర్‌: భారత మహిళల బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ భవిష్యత్‌కు భరోసా ఇస్తూ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం సింగపూర్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీలో మరో సంచలనం సృష్టించింది. గురువారం ప్రపంచ రెండో ర్యాంక్‌ జంటను బోల్తా కొట్టించిన గాయత్రి–ట్రెసా శుక్రవారం ప్రపంచ ఆరో ర్యాంక్‌ జోడీని ఇంటిదారి పట్టించింది. 

79 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 30వ ర్యాంక్‌ ద్వయం గాయత్రి–ట్రెసా 18–21, 21–19, 24–22తో కిమ్‌ సో యోంగ్‌–కాంగ్‌ హీ యోంగ్‌ (దక్షిణ కొరియా) జోడీని ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ గెలుపుతో గత ఏడాది ఆసియా క్రీడల్లో ఈ కొరియా జోడీ చేతిలో ఎదురైన ఓటమికి భారత జోడీ బదులు తీర్చుకుంది. 

నేడు జరిగే సెమీఫైనల్లో నాలుగో సీడ్‌ నమి మత్సుయామ–చిహారు షిదా (జపాన్‌)లతో గాయత్రి–ట్రెసా తలపడతారు. కొరియా ద్వయంతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో గాయత్రి–ట్రెసా ఓటమి అంచుల్లో నుంచి పుంజుకున్నారు. తొలి గేమ్‌ కోల్పోయి, రెండో గేమ్‌లో 12–18తో వెనుకబడిన గాయత్రి–ట్రెసా వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి ఆధిక్యాన్ని 17–18కి తగ్గించారు. 

ఆ తర్వాత కొరియా ద్వయం ఒక పాయింట్‌ సాధించగా... ఆ వెంటనే గాయత్రి–ట్రెసా వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచారు. నిర్ణాయక మూడో గేమ్‌లో పూర్తి సమన్వయంతో ఆడిన గాయత్రి–ట్రెసా కీలకదశలో పాయింట్లు నెగ్గి మరో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement