
నేటి నుంచి తొలి టెస్టు
లాహోర్: ప్రధాన ప్లేయర్లు లేకుండానే దక్షిణాఫ్రికా జట్టు... పాకిస్తాన్ పర్యటనకు సిద్ధమైంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. రెగ్యులర్ కెప్టెన్ తెంబా బవుమా, స్టార్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ గాయాల కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో సఫారీ జట్టుకు ఎయిడెన్ మార్క్‌రమ్ సారథ్యం వహిస్తున్నాడు.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2025–27 సర్కిల్‌లో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణాఫ్రికాకు ఇదే తొలి మ్యాచ్ కాగా... ఈ సారి కూడా మెరుగైన ఆరంభం దక్కించుకోవాలని చూస్తోంది. ఇరు జట్లు పేస్ బౌలింగ్‌కు పెట్టింది పేరు కాగా... ఇటీవలి కాలంలో పాకిస్తాన్ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతోంది. గత డబ్ల్యూటీసీలో దక్షిణాఫ్రికా విజేతగా నిలవగా... పాకిస్తాన్ జట్టు ఆఖరి స్థానంతో సరిపెట్టుకుంది.
మార్క్‌రమ్ సారథ్యంలోని సఫారీ జట్టు... వరుసగా 11 విజయాలు సాధించి ఈ మ్యాచ్ బరిలోకి దిగుతుండగా... గత 12 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ మూడింట మాత్రమే నెగ్గింది. మార్క్‌రమ్, రికెల్టన్, ముల్డర్, బ్రేవిస్, వెరినె, యాన్సన్‌తో సఫారీ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండగా... పాకిస్తాన్ జట్టు షాన్ మసూద్, బాబర్ ఆజమ్, సౌద్ షకీల్, మొహమ్మద్ రిజ్వాన్‌లను నమ్ముకుంది.
పరిమిత ఓవర్లలో జట్టుకు దాదాపు దూరమైన బాబర్ ఆజమ్, రిజ్వాన్ సుదీర్ఘ ఫార్మాట్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తారనేది కీలకం. ఈ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా జట్టు మొదట టెస్టులు, ఆతర్వాత టి20లు, అనంతరం వన్డేలు ఆడనుంది.