8 ఏళ్ల తర్వాత సఫారీ గడ్డపై ఆసీస్ టూర్
నేటి నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు
డర్బన్: ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ్రస్టేలియా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి డర్బన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. గతేడాది ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ తర్వాత ఇరు జట్ల మధ్య ఇదే తొలి టెస్టు మ్యాచ్. 2018లో చివరిసారిగా దక్షిణాఫ్రికాలో పర్యటించిన ఆస్ట్రేలియా జట్టు చేదు జ్ఞాపకాలను మూటగట్టుకుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కేప్‌టౌన్‌లో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ ప్లేయర్లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారు. బంతి ఆకారం మార్చేందుకు సాండ్ పేపర్‌ను వినియోగిస్తూ కెమెరాలకు చిక్కారు. దీంతో ఈ అంశంపై పెద్ద ఎత్తున దుమారం రేగింది.
ఈ దెబ్బతో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ కోల్పోగా... ఆసీస్ సిరీస్ పరాజయం మూటగట్టుకుంది. అప్పటి సఫారీ జట్టులో డుప్లెసిస్, డివిలియర్స్, హాషిమ్ ఆమ్లా, డీన్ ఎల్గర్, క్వింటన్ డికాక్, ఫిలాండర్, మోర్నీ మోర్కెల్, మార్క్‌రమ్, బవుమా వంటి స్టార్ ఆటగాళ్లు ఉండగా... ఇప్పుడు ప్రధాన పేసర్ కగిసో రబాడ లేకుండానే ఆ జట్టు బరిలోకి దిగనుంది. గతేడాది డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్‌ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా జట్టు ‘గద’ సొంతం చేసుకుంది. ఇప్పుడు వచ్చే ఏడాది డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడమే లక్ష్యంగా ఇరు జట్లు ఈ సిరీస్‌కు రెడీ అయ్యాయి. మార్క్‌రమ్, రికెల్టన్, బెడింగ్‌హామ్, బవుమా, స్టబ్స్, ముల్డర్, వెరీన్, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, హార్మర్, నోర్జేతో కూడిన తుది జట్టును దక్షిణాఫ్రికా ప్రకటించింది.
మరోవైపు ఆ్రస్టేలియా బ్యాటింగ్ ఆర్డర్ హెడ్, రెన్‌షా, లబుషేన్, స్టీవ్ స్మిత్, వెబ్‌స్టర్, కేఏరీ, కూపర్ కనోలీతో పటిష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజల్‌వుడ్, నాథన్ లయన్ బౌలింగ్ భారం పంచుకోనున్నారు. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో 300కు పైగా వికెట్లు తీసిన నలుగురు బౌలర్లు కలిసి ఆడిన ఏకైక జట్టు ఆ్రస్టేలియా. కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్, లయన్ ఈ ఘనత సాధించారు. మధ్యాహ్నం గం. 1 నుంచి యూరో స్పోర్ట్ టీవీ చానెల్, ఫ్యాన్ కోడ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
అప్పుడేం జరిగిందంటే...
2018లో దక్షిణాఫ్రికాలో పర్యటించిన ఆ్రస్టేలియా జట్టు నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ఆడింది. అందులో భాగంగా కేప్ టౌన్‌లో జరిగిన మూడో టెస్టు చరిత్రలో మాయని మచ్చలా మారింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు 311 పరుగులకు ఆలౌటైంది. బదులుగా... ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ పట్టుదలగా ఆడిన సఫారీ జట్టు 373 పరుగులు చేసింది. ఈ సమయంలో దక్షిణాఫ్రికా ప్లేయర్లు దూకుడుకు అడ్డుకట్ట వేయాలనుకున్న కంగారూ ప్లేయర్లు కుటిలనీతికి తెరలేపారు.
ఆసీస్ ఓపెనర్ కామెరాన్ బ్యాన్‌క్రాఫ్ట్ బంతి ఆకారం మార్చేందుకు ప్రయత్నించాడు. దీని కోసం అతడు సాండ్‌పేపర్‌ను వినియోగించడంతో... అది కెమెరాల కంటపడింది. ఆ సమయంలో జట్టుకు కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్‌కు దీని గురించి తెలిసినా వారు అడ్డుకోలేదు. దీంతో వారిద్దరిపై ఏడాది పాటు, బ్యాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించారు. ఆ తర్వాత బ్యాన్‌క్రాఫ్ట్ దాదాపు జట్టుకు దూరం కాగా... వార్నర్, స్మిత్ తిరిగి కెరీర్ కొనసాగించారు. వార్నర్‌ను కెరీర్ ఆసాంతం నాయకత్వ గ్రూప్‌నకు దూరంగా ఉంచగా... స్మిత్ మాత్రం తిరిగి పూర్వస్థితిలో రాణించగలిగాడు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురిలో ప్రస్తుతం స్మిత్ ఒక్కడే ఆ్రస్టేలియా జట్టులో ఉన్నాడు.


