బోణీ కొట్టిన కొలంబియా.. ఘన విజయం | FIFA WC 2026: Diaz Shines Colombia Beat Uzbekistan In Group K Game | Sakshi
Sakshi News home page

బోణీ కొట్టిన కొలంబియా.. ఘన విజయం

Jun 18 2026 11:11 AM | Updated on Jun 18 2026 11:51 AM

FIFA WC 2026: Diaz Shines Colombia Beat Uzbekistan In Group K Game

ఫిఫా ప్రపంచకప్‌-2026 టోర్నీలో కొలంబియా బోణీ కొట్టింది. గ్రూప్‌- ‘K’లో భాగంగా ఉజ్బెకిస్తాన్‌పై ఆద్యంతం ఆధిపత్యం కనబరిచి ఘన విజయం సాధించింది. తొలిసారి ప్రపంచకప్‌ ఆడుతున్న ఉజ్బెకిస్తాన్‌ను 3-1 తేడాతో చిత్తు చేసింది. 

మెక్సికో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లూయిస్‌ డియాజ్‌ ఇచ్చిన పాస్‌ను 40వ నిమిషంలో డానియల్‌ మునోజ్‌ గోల్‌గా మలిచాడు. అయితే, ఆ తర్వాత రెండో అర్ధ భాగంలో ఉజ్బెకిస్తాన్‌ గోల్‌ (60వ నిమిషం) కొట్టి సంచలనం నమోదు చేసింది. అబోస్బెక్‌ ఫేజులేవ్‌ ఉజ్బెకిస్తాన్‌ తరఫున ప్రపంచకప్‌లో తొలి గోల్‌ నమోదు చేశాడు.

ఆ ఆనందం మాత్రం ఉజ్బెకిస్తాన్‌కు ఎంతో సేపు నిలవలేదు. డియాజ్‌ 65వ నిమిషంలో గోల్‌ కొట్టి కొలంబియాను ఆధిక్యంలోకి తీసుకెళ్లగా.. జామిన్‌టన్‌ క్యాపేజ్‌ (90+9వ నిమిషం)  మరో గోల్‌ కొట్టి విజయాన్ని ఖరారు చేశాడు.

ఘనా విజయం
కెనడాలోని టొరంటో వేదికగా గ్రూప్‌-‘L’లో భాగంగా పనామాతో జరిగిన మ్యాచ్‌లో ఘనా గెలుపొందింది. అదనపు సమయంలో (90+5వ నిమిషం) కలేబ్‌ యిరెంక్యి గోల్‌ కొట్టి ఘనాను గెలిపించాడు.

నిజానికి ఈ మ్యాచ్‌కు ముందు ఘనా కీలక ఆటగాడు, మిడ్‌ఫీల్డర్‌ థామస్‌ పార్టీ జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌లో అతడిపై అత్యాచార ఆరోపణల నేపథ్యంలో కేసు విచారణ కొనసాగుతుండగా.. అతడిని కెనడా తమ దేశంలోకి అనుమతించలేదు. అయినప్పటికీ ఘనా కలేబ్‌ కారణంగా ఈ మ్యాచ్‌లో జయభేరి మోగించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement