బొగోటా: కొలంబియాలో దారుణం జరిగింది. నైరుతి ప్రాంతంలో ఉన్న అక్రమ బంగారు గనిలో కొండచరియలు విరిగిపడటంతో 14మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ వివరాలను అక్కడి అధికారులు ప్రకటించారు.
ఈ ఘటన జరిగిన నారినో ప్రాంతం ఈక్వెడార్ సరిహద్దుకు సమీపంలో ఉంది. అక్రమ బంగారు తవ్వకాలకు ఈ ప్రాంతం ప్రధాన కేంద్రంగా మారింది. ఇక్కడ సాయుధ ముఠాలు అక్రమ బంగారం వ్యాపారాన్ని తమ ఆధీనంలో ఉంచుకోవడంతో పాటు మాదకద్రవ్యాల అక్రమ రవాణా, బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేయడం వంటి నేరాలకు పాల్పడుతున్నాయి.
ప్రమాదం జరిగిన ప్రదేశానికి సహాయక బృందాలు చేరుకోవడం చాలా కష్టంగా మారింది. అక్కడి భౌగోళిక పరిస్థితులు క్లిష్టంగా ఉండటంతో పాటు, నేరాలకు పాల్పడే సాయుధ ముఠాల ఉనికి కూడా సహాయక చర్యలకు ఆటంకంగా మారిందని గవర్నర్ కార్యాలయం తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వీడియోల్లో స్థానికులు, సాయంతో మృతదేహాలను గని ప్రాంతం నుంచి సమీపంలోని నదికి తీసుకెళ్లి, పడవలో తరలిస్తున్న దృశ్యాలు కనిపించాయి.
ఇదీ చదవండి.. ఉత్తర కొరియా సంచలన వీడియో


