మధ్య అమెరికా దేశం పనామాలో 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం తర్వాత మరో ఆందోళనకర పరిణామం చోటుచేసుకుంది. మధ్య, దక్షిణ అమెరికాలోని తొమ్మిది దేశాలకు సునామీ ముప్పు పొంచి ఉందని అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ హెచ్చరించింది. ఈ విషయాన్ని పనామాలోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది.
పనామాలో భూకంపం నేపథ్యంలో ఆ దేశంతో పాటు కోస్టారికా, ఎల్ సాల్వడార్, పెరూ, మెక్సికో, గ్వాటెమాల, నికరాగువా, కొలంబియా, ఈక్వెడార్ దేశాలకు సునామీ ముప్పు ఉండొచ్చని అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ సూచించినట్లు ఏఎన్‌ఐ కథనం వెల్లడించింది. తీర ప్రాంతాల్లో బలమైన, అసాధారణ సముద్ర ప్రవాహాలు ఏర్పడటంతోపాటు అనూహ్యంగా అలలు ఎగసిపడే అవకాశం ఉందని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో ఉన్నవారు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని, స్థానిక అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని కోరింది.
అలాగే భూకంపం వల్ల దెబ్బతిన్న భవనాలు, నిర్మాణాలకు దూరంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లొద్దని సూచించింది. విద్యుత్, సమాచార వ్యవస్థలకు అంతరాయం ఏర్పడే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
A massive magnitude 7.7 earthquake struck Panama, shaking buildings more than 100 miles away and prompting evacuations, according to the U.S. Geological Survey. Tremors were felt in Panama City, where buildings shook and people evacuated into the streets. https://t.co/46kFq5wpSV https://t.co/jsr5g6uLDv
— CBS News (@CBSNews) October 9, 2026
కుప్పకూలిన భవనాలు.. రోడ్లు ధ్వంసం
పనామాను శుక్రవారం రాత్రి భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలు సుమారు నిమిషం పాటు కొనసాగాయి. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో భవనాలు, రహదారులు దెబ్బతిన్నాయి. పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో దేశంలో భారీ విపత్తు (Major Disaster) ఏర్పడిందని ప్రకటించారు. కొన్ని రహదారులు పూర్తిగా నాశనం అయ్యాయని తెలిపారాయన. దేశం భారీ విపత్తును ఎదుర్కొంటోందని.. సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు తానే స్వయంగా పెనోనోమే ప్రాంతానికి వెళ్తున్నట్లు ప్రకటించారు.
హెరేరా, కోక్లే, లాస్ శాంటోస్ ప్రావిన్సుల్లో భూకంప ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఫెర్నాండో బోయ్డ్ వెల్లడించారు. లాస్ శాంటోస్ ప్రావిన్సులోని టోనోసీ పట్టణానికి రోడ్డు మార్గంలో చేరుకోవడం అసాధ్యంగా మారిందని తెలిపారు. అక్కడికి విమానాల ద్వారా చేరుకునే మార్గాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
వెరాగువాస్ ప్రావిన్సులోని సోనా పట్టణంలో మాజీ అధ్యక్షుడు రికార్డో మార్టినెల్లి ఇల్లు సైతం కూలిపోయింది. పెనోనోమేలోని ఓ చర్చి, హోటల్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, తక్షణ సమాచారం ప్రకారం ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడికాలేదు.
భయంతో..
భూకంప కేంద్రానికి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని పనామా సిటీలోనూ ప్రకంపనల తీవ్రత కనిపించింది. ఎత్తైన భవనాల్లో ఉన్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు. 15 అంతస్తుల భవనం నుంచి రెండోసారి బయటకు వచ్చిన సాలమన్ ఆండియన్ అనే వ్యక్తి.. ఫర్నిచర్, మంచం, వంటగదిలోని వస్తువులు బలంగా కదిలాయని వెల్లడించారు.
TERREMOTO EN PANAMÁ ▪️Panamá afectado por este terrible terremoto de 7.6. Se sintió en Ciudad de Panamá, hay Alerta de tsunami; se produjeron varias réplicas. #Terremoto #Panamá #Sismo https://t.co/udnuMfvWiQ
— @ALTOS_NOTICIASpy (@Altosnoticiasp1) October 9, 2026
20 అంతస్తులకు పైగా ఉన్న ఓ భవనం పైకప్పుపై ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ నుంచి నీరు కిందకు జారిపడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పనామా కాలువపై ఉన్న ఓ వంతెన సైతం తీవ్రంగా కంపించినా కూలిపోలేదు. ఆ సమయంలో వాహనాలు వంతెనపై ప్రయాణిస్తున్న దృశ్యాలు ఆందోళన కలిగించాయి.
80కి పైగా ప్రకంపనలు.. విమానాశ్రయం మూసివేత
అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) ప్రకారం.. పనామాలోని పిటాలోజా అరిబా పట్టణానికి సమీపంలో భూకంప కేంద్రం నమోదైంది. తొలుత తీవ్రత 8.0గా అంచనా వేయగా, అనంతరం 7.7గా సవరించారు. భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 9 రాత్రి 11.26 గంటలకు భూకంపం సంభవించినట్లు భారత జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (ఎన్‌సీఎస్) తెలిపింది. భూకంప కేంద్రం పనామా సిటీకి నైరుతి దిశలో సుమారు 206 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు పేర్కొంది.
భూకంపం అనంతరం 80కి పైగా ప్రకంపనలు(ఆఫ్టర్ షాక్స్) నమోదయ్యాయి. వీటిలో ఒకటి 6.0 కంటే ఎక్కువ తీవ్రతతో సంభవించింది. ముందుజాగ్రత్త చర్యగా పనామా సిటీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసి, పలు విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. మరోవైపు, అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలిపే పనామా కాలువలో నౌకల రాకపోకలకు అంతరాయం లేదని అధికారులు వెల్లడించారు. కాలువ కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నాయని తెలిపారు.
భూకంపం నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాఠశాలల్లో తరగతులను నిలిపివేశారు. కొలంబియా, ఈక్వెడార్, గ్వాటెమాల దేశాల నాయకులు పనామాకు సంఘీభావం ప్రకటించడంతోపాటు అవసరమైతే సహాయం అందిస్తామని తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, అనవసర భయాందోళనలకు గురికావద్దని అధ్యక్షుడు ములినో విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: ఏకంగా ఐసీసీపైనే అమెరికా ఆంక్షలు



