వాషింగ్టన్: అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారీ ఆంక్షలు ప్రకటించింది. అమెరికా సంస్థలు ఐసీసీతో ఆర్థిక లావాదేవీలు జరపకుండా నిషేధం విధించే చర్యలు చేపట్టింది. అమెరికా సార్వభౌమత్వాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. అమెరికన్లపై విచారణ జరిపేందుకు ఐసీసీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే, ఈ చర్యలు అంతర్జాతీయ న్యాయవ్యవస్థకు విఘాతం కలిగిస్తాయని ఐసీసీ పేర్కొంది.
అయితే, ఇప్పటికే ఐసీసీకి చెందిన 17 మంది న్యాయమూర్తులు, అధికారులపై ఆంక్షలు విధించిన అమెరికా.. తాజాగా మొత్తం సంస్థనే లక్ష్యంగా చేసుకుంది. అమెరికా కంపెనీలు ఐసీసీకి బ్యాంకింగ్, సాఫ్ట్‌వేర్ వంటి సేవలు అందించడంపై ఈ చర్యలు ప్రభావం చూపనున్నాయి. కొన్ని ఆంక్షలు అమల్లోకి రావడానికి ఆరు నెలల గడువు ఇచ్చినట్లు వాషింగ్టన్ తెలిపింది. ఐసీసీ తన చర్యలను నిలిపివేయాలని, లేదంటే ఆ సంస్థనే అంతం చేస్తామని రూబియో హెచ్చరించారు.
2002లో ఏర్పాటైన ఐసీసీ యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలు, మారణహోమంపై విచారణ జరుపుతుంది. ఇందులో 125 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా సైనికుల చర్యలపై గతంలో చేపట్టిన దర్యాప్తు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా పలువురు అధికారులపై అరెస్టు వారెంట్లు జారీ చేయడం ట్రంప్ ప్రభుత్వ అసంతృప్తికి కారణమయ్యాయి.
అలాగే, అమెరికా నిర్ణయంపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ నేర న్యాయం కోసం ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు ఇది పెద్ద దెబ్బ అని పేర్కొన్నారు. బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, డెన్మార్క్, నెదర్లాండ్స్ దేశాలు ఐసీసీకి తమ మద్దతును ప్రకటించాయి. ఆంక్షల వల్ల కోర్టు కార్యకలాపాలు దెబ్బతినే అవకాశం ఉందని నెదర్లాండ్స్ తెలిపింది.
ఐసీసీ మాజీ న్యాయమూర్తి నవీ పిళ్లైకి 2026 నోబెల్ శాంతి బహుమతి ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా ఈ ఆంక్షలను వెల్లడించడం గమనార్హం. తమతో సహకరించే వారిని భయపెట్టడమే ఈ చర్యల ఉద్దేశమని ఐసీసీ పేర్కొంది. అయినప్పటికీ తమ కార్యకలాపాలను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. తాజా పరిణామాలతో అంతర్జాతీయ నేర న్యాయవ్యవస్థ భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: మతోన్మాది, అవినీతిపరురాలు.. నవీ పిళ్ళైపై నెతన్యాహు ఫైర్


