
మాంచెస్టర్: భారత మాజీ వికెట్ కీపర్, తమ జట్టుకు సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన ఫరూఖ్ ఇంజినీర్‌ను లాంకషైర్ కౌంటీ క్లబ్ సముచితంగా గౌరవించింది. ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో ఒక స్టాండ్‌కు దిగ్గజం క్రికెటర్ క్లయివ్ లాయిడ్‌తో కలిపి ‘సర్ క్లయివ్ లాయిడ్ అండ్ ఫరూఖ్ ఇంజినీర్ స్టాండ్’ అని పేరు పెట్టింది.
నాలుగో టెస్టు ఆరంభానికి ముందు ఈ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ముంబైకి చెందిన ఫరూఖ్ ఇంజినీర్ 1961–1975 మధ్య భారత్ తరఫున 46 టెస్టులు ఆడి 2611 పరుగులు చేయడంతో పాటు కీపర్‌గా 82 వికెట్ల పతనంలో భాగస్వామిగా ఉన్నారు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌లో చాలా భాగం ఇంగ్లండ్ కౌంటీ లాంకషైర్‌నే తన సొంత జట్టుగా చేసుకున్న ఫరూఖ్... లాంకషైర్ తరఫున 175 మ్యాచ్‌లలో 5942 పరుగులు సాధించి 429 క్యాచ్‌లు పట్టారు. విండీస్ ఆల్‌టైమ్ గ్రేట్ లాయిడ్ లాంకషైర్ తరఫున 219 మ్యాచ్‌లలో 12,764 సాధించారు.
వీరిద్దరు ప్రాతినిధ్యం వహించిన ఎనిమిదేళ్ల సమయంలో జట్టు వరుస విజయాలతో ఏడు ట్రోఫీలు గెలుచుకుంది. అందుకే వీరిద్దరిని గౌరవిస్తూ స్టాండ్‌కు పేరు పెట్టింది. సొంత దేశంలో లభించని గౌరవం తనకు ఇక్కడ లభించడం పట్ల ఫరూక్ ఇంజినీర్ సంతోషం వ్యక్తం చేశారు.
చదవండి: జెర‍్సీ నంబర్ 'ఏకే-47'