
భారత క్రికెట్‌లో దూసుకొచ్చిన అన్షుల్ కంబోజ్
దేశవాళీ క్రికెట్‌లో ఆకట్టుకునే ప్రదర్శనలు
దాదాపు ఆరు వారాల క్రితం... నార్తాంప్టన్‌లో ఇంగ్లండ్ లయన్స్‌తో భారత్ ‘ఎ’ తలపడిన అనధికారిక టెస్టులో అన్షుల్ కంబోజ్ సభ్యుడిగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో 4 వికెట్లు తీయడంతో పాటు అతను అర్ధ సెంచరీ కూడా సాధించాడు. మరో 10 రోజుల్లో భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా జట్టులో ప్రధాన పేసర్ ఒకరు గాయంతో బాధపడుతుండటంతో ముందు జాగ్రత్తగా మరో పేసర్‌ను టీమ్‌తో చేర్చాలని మేనేజ్‌మెంట్ భావించింది. ‘ఎ’ తరఫున ప్రదర్శన చూసిన తర్వాత కంబోజ్‌కు అవకాశం దక్కవచ్చని అంతా అనుకున్నారు. అయితే హర్షిత్ రాణాను జట్టు ఎంచుకుంది.
స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాతి రోజు ఉదయమే తాను రోజూ సాధన చేసే అకాడమీకి కంబోజ్ చేరుకున్నాడు. ఇంగ్లండ్ నుంచి వస్తూ వస్తూ అతను కొన్ని డ్యూక్స్ బంతులను వెంట తెచ్చుకున్నాడు. సింగిల్ స్టంప్‌ను పెట్టుకొని వాటితో ప్రాక్టీస్ మొదలు పెట్టేశాడు. కోచ్ ఎలా ఉన్నావు అడిగితే ‘అంతా బాగుంది సర్. కానీ నాకు ఇంకా నమ్మకం ఉంది’ అంటూ జవాబిచ్చాడు. జట్టులో స్థానంపై ఆశలు కోల్పోని కంబోజ్‌కు కొద్ది రోజులకే తీపి కబురు వచ్చింది. డ్యూక్స్ బంతులతో సాధన ఇంగ్లండ్‌తో మ్యాచ్ కోసమేనా అన్నట్లుగా వచ్చీ రాగానే టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశం కూడా లభించింది. – సాక్షి క్రీడా విభాగం
హరియాణాలో బాక్సర్లకు అడ్డా అయిన కర్నాల్ సమీపంలో ఫజీల్‌పూర్ అన్షుల్ స్వస్థలం. చాలా మందిలాగే అతనూ మట్టి మైదానాల్లో క్రికెట్ ఆడుతూ వచ్చాడు. 14 ఏళ్ల వయసు వచ్చాకే బౌలింగ్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు. తండ్రి ఉధమ్ సింగ్ అన్ని రకాలుగా అండగా నిలవగా... స్థానిక కోచ్ సతీశ్ రాణా అతడిని తీర్చి దిద్దాడు. అకాడమీలో చేర్పించిన అనంతరం అన్షుల్ ఆట పదునెక్కింది.
ఆ్రస్టేలియా దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్‌ను విపరీతంగా అభిమానించే అతను... మెక్‌గ్రాత్ తరహాలోనే పేస్ కంటే కూడా కచ్చితత్వంపైనే ఎక్కువగా ఆధారపడతాడు. భారత్‌లో స్వింగ్ బౌలింగ్‌కు బాగా అనుకూలించే మైదానంగా గుర్తింపు పొందిన లాహ్లిలో ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం కలిసి రాగా, తీవ్ర సాధనతో అన్షుల్ సీమ్ బౌలింగ్‌లో రాటుదేలాడు. ఇప్పుడే అదే ప్రత్యేకత అతడిని తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యేలా చేసింది.

నాన్నకు ఆనందం పంచుతూ...
ఆరేళ్ల క్రితం భారత అండర్–19 జట్టుకు ఎంపిక కావడం అన్షుల్ కెరీర్‌లో కీలక మలుపు. నిజానికి అంతకు కొద్ది రోజుల ముందే అండర్–19 వరల్డ్ కప్‌లో ఆడే భారత జట్టులో చోటు లభించే అవకాశం రాగా, గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఆ సమయంలో తీవ్రంగా బాధపడిన అన్షుల్ ఆటను వదిలేద్దామనుకున్నాడు.
కానీ అతనిలోని ప్రతిభ గురించి తెలిసిన తండ్రి కొనసాగమని గట్టిగా ప్రోత్సహించాడు. దాంతో పట్టుదలగా ఆడుతూ ముందుకు వెళ్లిన అన్షుల్ 2022లో తొలిసారి హరియాణా తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్ బరిలోకి దిగాడు. మూడేళ్లు గడిచేసరికి ఇప్పుడు భారత్ తరఫున టెస్టు క్రికెట్ ఆడటంతో తండ్రి ఆనందానికి అవధుల్లేవు. గత పదేళ్లుగా ఉధమ్ సింగ్ నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కంబోజ్ ఎంపిక తండ్రి బాధలన్నీ ఒక్క క్షణంలో దూరం చేసిందని అతని సోదరుడు సంయమ్ చెప్పాడు.
కంబోజ్ మ్యాచ్ ఆడే సమయంలోనే అతని తల్లికి కిడ్నీ సంబంధిత సర్జరీ కూడా ఉంది. ఆ సమయంలో కొడుకు లేకపోయినా... కోలుకున్న తర్వాత ఆ కుటుంబంలో కనిపించే సంతోషం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు 24 మ్యాచ్‌ల ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 22.88 సగటుతో 79 వికెట్లు పడగొట్టిన అన్షుల్ తొలి టెస్టులో బౌలింగ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు.

ఆ రెండు ప్రదర్శనలు...
అన్షుల్ అనూహ్యంగా దూసుకు వచ్చిన తరహా ఆటగాడు కాదు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శనతో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. 2023–24 సీజన్ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీని హరియాణా గెలుచుకోవడంలో 17 వికెట్లతో అతను కీలక పాత్ర పోషించాడు. ఇది అతనికి రూ.20 లక్షలతో తొలి ఐపీఎల్ అవకాశం ఇప్పించింది. 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున 3 మ్యాచ్‌లు ఆడగలిగాడు. తొలి మ్యాచ్‌లో ట్రవిస్ హెడ్‌ను క్లీన్‌బౌల్డ్ చేయగా... అది నోబాల్‌గా తేలింది.
ఈ స్థాయిలో ఆడటం అంత సులువు కాదని అది తనకు నేర్పించిందని అతను గుర్తు చేసుకున్నాడు. అన్షుల్ ప్రతిభకు ఐపీఎల్ 2025లో గుర్తింపు దక్కింది. వేలంలో రూ.3 కోట్ల 40 లక్షలకు అతడిని సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచ్‌లలో అవకాశం ఇచ్చింది. ఈ హరియాణా ప్లేయర్ తన పేరును, జెర్సీ నంబర్‌ను ఒకే చోట చేర్చి (అన్షుల్ కంబోజ్–ఏకే 47) పేరుతో జెర్సీని ధరించి ఐపీఎల్ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగాడు.
గత సీజన్ దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో భారత్ ‘సి’ తరఫున ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసిన అన్షుల్, రంజీ మ్యాచ్‌లో కేరళపై ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా ఘనతను అందుకున్నాడు. అనంతపురంలో జరిగిన దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో బౌలింగ్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని పిచ్‌పై భారత్ ‘సి’ 525 పరుగులు చేయగా... అన్షుల్ దెబ్బకు ‘బి’ 332 పరుగులకే ఆలౌటైంది.
‘ప్రతిభ మాత్రమే కాదు...జహీర్, బుమ్రా తరహాలో తనదైన వ్యూహంతో బౌలింగ్ చేయగల అరుదైన పేసర్ అన్షుల్’ అంటూ అతని సీఎస్‌కే సహచరుడు అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లండ్ గడ్డపై తనకు లభించిన అవకాశాలను అన్షుల్ సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లడం ఖాయం.