
భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మాంచెస్టర్ వేదికగా రేపటి నుంచి ప్రారంభం కానుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడి ఆటంకం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మ్యాచ్ జరిగే ఐదు రోజులూ వర్షం పడే అవకాశాలున్నాయని అంచనా.
వెదర్ రిపోర్ట్‌ను నిజం చేస్తూ మాంచెస్టర్‌లో ఇవాల్టి నుంచే వర్షం మొదలైంది. స్టేడియం చుట్టూ దట్టమైన మబ్బులు కమ్ముకొని భారీ వర్షం కురుస్తుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మైదానం చిత్తడిగా మారి, రేపు ఆట ప్రారంభ సమయానికి ఇబ్బంది పెట్టవచ్చు. వాతావరణం ఇలాగే కొనసాగితే పిచ్ ప్రభావంలో కూడా మార్పు రావచ్చు.
BAD NEWS FOR CRICKET FANS 📢
- It's raining in Manchester ahead of the 4th Test. [Bharat Sharma from PTI] pic.twitter.com/OF0PgPhzxv— Johns. (@CricCrazyJohns) July 22, 2025
ప్రస్తుతానికి పిచ్ బ్యాటర్లు, బౌలర్లకు సమాంతరంగా సహరించవచ్చు. తొలి మూడు రోజుల్లో ఉదయం పూట (తొలి సెషన్‌లో) బంతి బౌన్స్ అవుతుంది. దీన్ని బ్యాటర్లు అడ్వాంటేజ్‌గా తీసుకోవచ్చు. ఆట గడిచే కొద్దీ స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుందని అంచనా. ఈ పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు లబ్ది చేకూరే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
టీమిండియా విషయానికొస్తే.. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉంది. ఈ మ్యాచ్ భారత్‌కు డు ఆర్ డై అన్నట్లుగా మారింది. మాంచెస్టర్‌లో భారత్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోవడం ఆందోళన కలిగించే అంశం.
ఈ పిచ్‌పై టీమిండియా ఇప్పటివరకు 9 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా.. నాలుగు సార్లు ఓటమిపాలై, ఐదు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. చివరిగా భారత్ ఈ పిచ్‌పై 2014లో మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. 2014లో ఆడిన భారత్ జట్టు సభ్యుల్లో ప్రస్తుతం రవీంద్ర జడేజా ఒక్కడే ఉన్నాడు. ఇది ఓ రకంగా భారత్‌కు కలిసొచ్చే విషయం.
ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేసుకుంటుందో, లేక ఓడి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను చేజార్చుకుంటుందో చూడాలి.
నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవెన్..
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.
టీమిండియా (అంచనా)..
యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్/కరుణ్ నాయర్, శుభమన్ గిల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ (WK), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అన్షుల్ కాంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.