
లార్డ్స్ టెస్టులో భారత్ అనూహ్య ఓటమి
22 పరుగులతో గెలిచిన ఇంగ్లండ్
సిరీస్‌లో 2–1తో ముందంజ
రవీంద్ర జడేజా పోరాటం వృథా
లార్డ్స్ టెస్టులో భారత్ గుండె పగిలింది. విజయానికి ఎంతో చేరువగా వచ్చినా చివరకు ఓటమే పలకరించింది. ఐదో రోజు చేతిలో 6 వికెట్లతో 135 పరుగులు చేయాల్సిన టీమిండియా లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైంది. ఆశలు పెట్టుకున్న పంత్, రాహుల్ విఫలం కాగా... 82/7 నుంచి జట్టును గెలిపించేందుకు రవీంద్ర జడేజా పోరాడినా లాభం లేకపోయింది.
ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ జట్టును ముందుండి నడిపించగా... పట్టుదలగా బౌలింగ్ చేసిన ఆతిథ్య జట్టు మ్యాచ్ చేజారకుండా కాపాడుకోగలిగింది. ఈ టెస్టులో పలు సందర్భాల్లో శుబ్‌మన్ గిల్ బృందం ఆధిక్యం ప్రదర్శించినా... కీలక క్షణాలను ఇంగ్లండ్ సరిగ్గా ఒడిసి పట్టుకుంది. టీమ్ వెనుకబడిన ప్రతీసారి పోరాటయోధుడిలా నేనున్నానంటూ ముందుకొచ్చి సత్తా చాటిన స్టోక్స్‌దే ఈ గెలుపు అనడం అతిశయోక్తి కాదు.
లండన్: ‘అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ’లో ఇంగ్లండ్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సోమవారం లార్డ్స్ మైదానంలో ముగిసిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 22 పరుగుల స్వల్ప తేడాతో భారత్‌పై విజయం సాధించింది. అనూహ్య మలుపులు, ఉత్కంఠతో సాగుతూ వచ్చిన మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం భారత్‌ను దెబ్బ తీసింది. 193 పరుగుల లక్ష్యంతో ఐదో రోజు బరిలోకి దిగిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 74.5 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది.
రవీంద్ర జడేజా (181 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లండ్ పదునైన బౌలింగ్‌తో స్వల్ప స్కోరును కూడా కాపాడుకోవడంలో సఫలమైంది. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 77 పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు తీసిన బెన్ స్టోక్స్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్నాడు. సిరీస్‌లో ఇంగ్లండ్ 2–1తో ముందంజలో ఉండగా... నాలుగో టెస్టు ఈ నెల 23 నుంచి మాంచెస్టర్‌లో జరుగుతుంది.
ఆర్చర్ పదునైన బౌలింగ్...
ఓవర్‌నైట్ స్కోరు 58/4తో ఆటను కొనసాగించిన భారత్‌కు చివరి రోజు సరైన ఆరంభం లభించలేదు. 11 పరుగుల వ్యవధిలో జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. గాయంతో బాధపడుతున్న పంత్ తడబడుతూనే బ్యాటింగ్ చేశాడు. ఆర్చర్ అద్భుత బంతితో పంత్ (9)ను క్లీన్‌బౌల్డ్ చేయగా, స్టోక్స్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (58 బంతుల్లో 39; 6 ఫోర్లు) వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో రివ్యూ కోరిన ఇంగ్లండ్ ఫలితం సాధించింది. తర్వాతి ఓవర్లోనే ఆర్చర్ తన బౌలింగ్‌లో అద్భుత రిటర్న్ క్యాచ్‌తో సుందర్ (0)ను పెవిలియన్ పంపించాడు. 82/7 వద్ద పరిస్థితి చూస్తే భారత్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టదనిపించింది.
జడేజా పోరాటం...
అప్పటి వరకు 15 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేసిన జడేజా... జట్టు భారాన్ని తనపై వేసుకున్నాడు. తాను ప్రధాన పాత్ర పోషిస్తూ తర్వాతి ముగ్గురు బ్యాటర్లతో అతను కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. భారీ షాట్లకు పోకుండా సింగిల్స్‌తోనే ఒక్కో పరుగు జోడించడంతో పాటు అవతలి బ్యాటర్లను కాపాడుకుంటూ అతని
ఇన్నింగ్స్ సాగింది. ఈ క్రమంలో పరుగుల రాక కూడా బాగా తగ్గిపోయింది.
పదునైన డిఫెన్స్ చూపించగలిగినా... నితీశ్ కుమార్ రెడ్డి (53 బంతుల్లో 13; 1 ఫోర్) లంచ్‌కు ముందు వోక్స్ చక్కటి బంతికి వెనుదిరిగాడు. ఆ తర్వాత జస్‌ప్రీత్ బుమ్రా (54 బంతుల్లో 5; 1 ఫోర్), జడేజా భాగస్వామ్యం ఏకంగా 22 ఓవర్ల పాటు సాగింది. సహనం కోల్పోయిన బుమ్రా భారీ షాట్ ఆడబోయి అవుట్ కాగా... మొహమ్మద్ సిరాజ్ (40 బంతుల్లో 4) అండతో జడేజా జట్టును గెలుపు దిశగా నడిపించాడు. అయితే చివర్లో పెరిగిన ఉత్కంఠ మధ్య స్పిన్నర్ బషీర్ బౌలింగ్‌లో సిరాజ్ వికెట్‌తో భారత్ ఓటమి ఖాయయైంది.
అలా ముగిసింది...
భారత్ విజయానికి మరో 46 పరుగులు కావాల్సిన సమయంలో జడేజాతో సిరాజ్ జత కలిశాడు. జడేజా జాగ్రత్తగా స్ట్రయికింగ్ నిలబెట్టుకుంటుండగా... సిరాజ్ కూడా పట్టుదలగా 29 బంతులు ఆడి సహకరించాడు. మెలమెల్లగా భాగస్వామ్యం 13.1 ఓవర్లలో 23 పరుగులు పూర్తి చేసుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరి వికెట్ తీయలేక ఇంగ్లండ్ శిబిరంలో అసహనం పెరిగిపోతోంది.

ఇలాగే సాగితే సింగిల్స్‌తో మరో 23 పరుగులు కావడం సాధ్యమే అనిపించింది. అయితే సిరాజ్ అనూహ్య వికెట్‌తో ఆట ముగిసింది. బషీర్ వేసిన బంతిని సిరాజ్ దానిని చక్కగా డిఫెన్స్ ఆడాడు. అయితే కింద పడిన బంతి నెమ్మదిగా అతని కాలి వెనక భాగం వైపు వెళ్లగా, దానిని సిరాజ్ గుర్తించలేకపోయాడు. తేరుకునేలోపే బంతి స్టంప్స్‌ను తాకి ఒక బెయిల్ కింద పడటంతో ఇంగ్లండ్ సంబరాలు చేసుకుంది.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 387; భారత్ తొలి ఇన్నింగ్స్: 387; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 192;
భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) ఆర్చర్ 0; రాహుల్ (ఎల్బీ) (బి) స్టోక్స్ 39; కరుణ్ నాయర్ (ఎల్బీ) (బి) కార్స్ 14; గిల్ (సి) స్మిత్ (బి) కార్స్ 6; ఆకాశ్‌దీప్ (బి) స్టోక్స్ 1; పంత్ (బి) ఆర్చర్ 9; జడేజా (నాటౌట్) 61; సుందర్ (సి అండ్ బి) ఆర్చర్ 0; నితీశ్ రెడ్డి (సి) స్మిత్ (బి) వోక్స్ 13; బుమ్రా (సి) (సబ్) కుక్ (బి) స్టోక్స్ 5; సిరాజ్ (బి) బషీర్ 4; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (74.5 ఓవర్లలో ఆలౌట్) 170.
వికెట్ల పతనం: 1–5, 2–41, 3–53, 4–58, 5–71, 6–81, 7–82, 8–112, 9–147, 10–170.
బౌలింగ్: వోక్స్ 12–5–21–1, ఆర్చర్ 16–1–55–3, స్టోక్స్ 24–4–48–3, కార్స్ 16–2–30–2, రూట్ 1–0–1–0, బషీర్ 5.5–1–6–1.