
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయు ప్రమాణం గురించి మాట్లాడుతూ.. ఫిట్‌నెస్ ఆవశ్యకతను వివరించాడు. శారీరక శ్రమ చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారని.. కానీ యువతరం ఈ విషయంలో అంతగా శ్రద్ధ తీసుకుంటున్నట్లు కనిపించడం లేదన్నాడు.
44 ఏళ్ల వయసులోనూ
భారత్‌కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ధోని 44 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు సారథిగా ఐదు ట్రోఫీలు అందించిన తలా.. ప్రస్తుతం ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన నేపథ్యంలో మరోసారి కెప్టెన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు.
ఇక ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడిగా పేరొందిన ధోని.. నాలుగు పదుల వయసు దాటిన తర్వాత కూడా మైదానంలో పాదరసంలా కదలడం విశేషం. వికెట్ల మధ్య పరుగులు తీయడంలోనూ యువ ఆటగాళ్లకు అతడు పోటీ ఇస్తాడంటే అతిశయోక్తి కాదు.
నా కూతురు కూడా అంతే
కాగా.. తాజాగా ధోని తన స్వస్థలం రాంచిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఫిట్‌నెస్ ప్రాముఖ్యత గురించి వివరించాడు. ‘‘ఈ రోజుల్లో శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. ఫలితంగా ఆయు ప్రమాణం కూడా తగ్గిపోతోంది.
భారతీయుల సగటు ఆయు ప్రమాణం క్షీణిస్తోంది. నా కూతురు కూడా ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేసేందుకు ఇష్టపడదు. తనకు ఆటలాడటం పెద్దగా ఇష్టం ఉండదు. పిల్లలు బయటకు వెళ్లి ఆడకపోతే శారీరకంగా ఎలా చురుగ్గా ఉండగలరు?
కచ్చితంగా ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. అందుకోసం ప్రతి తల్లిదండ్రులు వాళ్లను కొత్త ఆటలు ఆడేలా వారిలో స్ఫూర్తి నింపాలి’’ అని ధోని చిన్ననాటి నుంచే ఫిట్‌నెస్ మీద అవగాహన అవసరమని చెప్పుకొచ్చాడు.
కాగా 2010లో సాక్షి సింగ్ రావత్‌ను పెళ్లాడాడు ధోని. ఈ జంటకు 2015లో కుమార్తె జన్మించగా.. జీవాగా నామకరణం చేశారు. పదేళ్ల జీవా కాస్త బొద్దుగా ఉండేది. తల్లి సాక్షితో కలిసి ధోనీ మ్యాచ్‌లు చూసేందుకు వచ్చే జీవా.. తండ్రి ఆటను ఆస్వాదిస్తూ కరతాళ ధ్వనులతో అతడిని ఉత్సాహపరచడంలో ముందే ఉంటుంది.
చదవండి: రెండు నెలల్లోనే 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్‌కు ఇదెలా సాధ్యమైందంటే?