
ఫుట్‌బాలర్లతో భారత క్రికెటర్ల సరదా ఆట
మాంచెస్టర్: భారత క్రికెట్ జట్టు ఒకవైపు నాలుగో టెస్టుకు సన్నద్ధమవుతూనే మరోవైపు విరామ సమయాన్ని సరదాగా గడుపుతోంది. తాజాగా విఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ ‘మాంచెస్టర్ యునైటెడ్’ ప్రాక్టీస్ గ్రౌండ్‌ను టీమిండియా ఆటగాళ్లు సందర్శించారు. ఇరు జట్లకు ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న స్పోర్ట్స్‌వేర్ ‘అడిడాస్’ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. క్రికెట్, ఫుట్‌బాల్ టీమ్‌ల సభ్యులు పరస్పర గౌరవాన్ని ప్రదర్శిస్తూ జెర్సీలు మార్చుకున్నారు. భారత ఆటగాళ్లతో పాటు మాంచెస్టర్ ఆటగాళ్లంతా రెండు జట్లుగా విడిపోయి ముందుగా ఫుట్‌బాల్ ఆడారు.
ఆపై మాంచెస్టర్ ప్లేయర్లు క్రికెట్‌లో తమ ఆసక్తి ప్రదర్శిస్తూ బ్యాటింగ్ చేశారు. స్టార్ డిఫెండర్ హ్యారీ మేగ్వైర్‌కు సిరాజ్ బౌలింగ్ చేయగా... ‘రెడ్ డెవిల్స్’ టీమ్ సభ్యులు డియాలో, మేసన్ మౌంట్ తదితరులతో ఫుట్‌బాల్ ఆడేందుకు పంత్, బుమ్రా ప్రత్యేక ఆసక్తి కనబర్చారు. మాంచెస్టర్ యునైటెడ్, పోర్చుగల్ జట్లకు కెపె్టన్ అయిన బ్రూనో ఫెర్నాండెజ్‌తో భారత కెపె్టన్ శుబ్‌మన్ గిల్ కబుర్లాడాడు.

మరోవైపు భారత్, మాంచెస్టర్ యునైటెడ్ హెడ్ కోచ్‌లు గంభీర్, రూబెన్ అమోరిమ్ మధ్య కూడా సుదీర్ఘ సంభాషణ చోటు చేసుకుంది. శిక్షణ, నాయకత్వం, స్టార్ ఆటగాళ్లతో జట్లను నడిపించడంవంటి అంశాలపై చివర్లో ఇరు జట్ల కోచ్‌లు తమ అభిప్రాయాలు వెల్లడించడంతో కార్యక్రమం ముగిసింది. బుధవారం నుంచి ఓల్ట్ ట్రఫోర్డ్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతుంది.