Fact Check: గిల్‌తో ఫొటో షేర్‌ చేసి ‘రిలేషన్‌’ కన్ఫర్మ్‌ చేసిందంటూ ప్రచారాలు.. వాస్తవం ఇదే

Fact Check: Did Sara Tendulkar Share Pic With Shubman Gill Truth Is - Sakshi

Fact Check: డిజిటల్‌ యుగంలో ఏది నిజమో ఏది అబద్ధమో పోల్చుకోవడం కష్టతరంగా మారింది. సోషల్‌ మీడియా వాడకం పెరిగిన తర్వాత మార్ఫ్‌డ్‌ ఫొటోలు, వీడియోల వ్యాప్తికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. సెలబ్రిటీలను ముఖ్యంగా ఆడవాళ్లను టార్గెట్‌ చేస్తూ.. సైబర్‌ క్రిమినల్స్‌ చేసే ఇలాంటి చెత్త పనుల వల్ల.. సామాన్యులు కూడా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి తలెత్తింది.

అమ్మాయిల భద్రతపై ఆందోళన
స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా డీప్‌ఫేక్‌ వీడియో వైరల్‌గా మారిన తరుణంలో.. టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ కుమార్తె సారా టెండుల్కర్‌కు సంబంధించిన ఫొటోపై నెట్టింట చర్చ మొదలైంది.

ప్రేమలో ఉన్నారంటూ వదంతులు
కాగా టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌తో సారా ప్రేమలో ఉన్నట్లు వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. గిల్‌ సోదరి షానిల్‌కు సారా స్నేహితురాలు. ఈ క్రమంలో గిల్‌- సారా మధ్య కూడా పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసిందని గాసిప్‌ రాయుళ్లు గతంలో కథనాలు అల్లారు.

సోషల్‌ మీడియాలో శుబ్‌మన్‌ గిల్‌- సారా ఒకరినొకరు ఫాలో అవడం.. గిల్‌ విజయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సారా కామెంట్లు చేయడం ఇందుకు ఊతమిచ్చింది. అయితే, కొన్ని రోజుల తర్వాత వీరిద్దరు విడిపోయారనే ప్రచారం కూడా జరిగింది.

సారా వైపునకే కెమెరాలు
ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్‌-2023 సందర్భంగా ముంబైలో టీమిండియా మ్యాచ్‌ సందర్భంగా సారా టెండుల్కర్‌ స్టేడియానికి రావడంతో మరోసారి పాత రూమర్లు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా గిల్‌ షాట్లు ఆడినప్పుడల్లా కెమెరాలు ఆమె వైపునకు తిప్పడం.. ఆ సమయంలో సారా చప్పట్లుకొడుతూ జట్టు(గిల్‌ను మాత్రమే అన్నట్లు అపార్థాలు)ను ఉత్సాహపరుస్తూ కనిపించడం ఇందుకు కారణం.

స్టేడియంలో అల్లరిమూకల అతిచేష్టలు
ఇక స్టేడియంలో కొంతమందైతే గిల్‌ షాట్‌ బాదినప్పుడల్లా సారా వదిన అంటూ అత్యుత్సాహం ప్రదర్శించడం మరీ దారుణం. ఇలాంటి తరుణంలో జియో వరల్డ్‌ ప్లాజా ప్రారంభోత్సవంలో వీరిద్దరు కలిసి కనిపించిన వీడియోలు కూడా వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో సారా... శుబ్‌మన్‌ను ప్రేమగా హత్తుకుని ఉన్నట్లుగా ఉన్న ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే, వాస్తవానికి అది మార్ఫ్‌డ్‌ ఫొటో. 

నిజం ఇదే:
తన తమ్ముడు అర్జున్‌ టెండుల్కర్‌ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబరు 24న సారా టెండుల్కర్‌ కొన్ని ఫొటోలు షేర్‌ చేసింది. ‘‘నా చిన్నారి తమ్ముడు ఈ 24న 24వ వసంతంలోకి!! హ్యాపియెస్ట్‌ బర్త్‌డే. మీ అక్క నీకెప్పుడూ అండగా ఉంటుంది’’ అంటూ క్యాప్షన్‌ జతచేసింది.

ఇందులో తమ చిన్ననాటి ఫొటోలతో పాటు ప్రస్తుత ఫొటోలు కూడా పోస్ట్‌ చేసింది. వాటిలో ఓ ఫొటోలో అర్జున్‌కు ఆత్మీయంగా హత్తుకున్న సారా ఫొటోను మార్ఫ్‌ చేసినట్లు స్పష్టమైంది. అర్జున్‌ ప్లేస్‌లో శుబ్‌మన్‌ ఫొటో పెట్టి కొంతమంది సోషల్‌ మీడియాలో వ్యాప్తి చేశారు. అయితే, సారా ఇన్‌స్టాగ్రామ్‌ పరిశీలించగా అర్జున్‌ ఫేస్‌కు బదులు శుబ్‌మన్‌ ఫేస్‌ యాడ్‌ చేసి ఈ ఫొటో మార్ఫింగ్‌ చేసినట్లు బయటపడింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top