
లండన్: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు ఈ నెల 23 నుంచి జరగనుండగా అప్పుడే తుది జట్టుపై చర్చ మొదలైంది. సిరీస్‌లో జట్టు ఆడిన మూడు టెస్టులను చూస్తే బ్యాటర్ కరుణ్ నాయర్ మినహా ఇతర ఆటగాళ్లంతా రాణించారు. నాయర్ మాత్రం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. క్రీజ్‌లోకి వచ్చాక మెరుగ్గానే ఇన్నింగ్స్‌లను ఆరంభించినా...వాటిని అతను భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు.
అతను వరుసగా 0, 20, 31, 26, 40, 14 (మొత్తం 131 పరుగులు) స్కోర్లు నమోదు చేశాడు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత తనకు లభించిన ‘మరో చాన్స్’ను నాయర్ సది్వనియోగం చేసుకోలేదు. ముఖ్యంగా లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతను అవుటైన తీరు విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టులో నాయర్ స్థానం నిలబెట్టుకోవడం కష్టంగానే ఉంది.
కీలకమైన మూడో స్థానంలో నాయర్‌కు బదులుగా యువ ఆటగాడు సాయి సుదర్శన్‌కు మరో అవకాశం ఇవ్వాలని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. లీడ్స్ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయినా... రెండో ఇన్నింగ్స్‌లో చక్కటి షాట్లతో చెప్పుకోదగ్గ ప్రదర్శన (30 పరుగులు) కనబర్చాడు. తుది జట్టుకు సంబంధించి ఈ ఒక్క మార్పు మాత్రం కచ్చితంగా ఉండవచ్చని తెలుస్తోంది.
కాగా, 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ 2, భారత్ ఓ టెస్ట్ మ్యాచ్‌లో గెలిచాయి. సిరీస్‌లో నిలబడాలంటే భారత్ నాలుగో టెస్ట్‌లో గెలవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో తుది జట్టులో పలు మార్పులకు ఆస్కారం ఉంది. విశ్లేషకుల అభిప్రాయం మేరకు కరుణ్ నాయర్‌ను తప్పించి సాయి సుదర్శన్‌కు అవకాశం ఇవ్వవచ్చు.