అత్యుత్తమ టెస్టు జట్టు ఇదే.. జైసూకు దక్కని చోటు! | Ex India cricketer picks Test World XI leaves out Yashasvi Jaiswal | Sakshi
Sakshi News home page

ప్రస్తుత అత్యుత్తమ టెస్టు జట్టు ఇదే.. జైసూకు దక్కని చోటు!

Jun 4 2026 4:42 PM | Updated on Jun 4 2026 4:56 PM

Ex India cricketer picks Test World XI leaves out Yashasvi Jaiswal

టీమిండియా కెప్టెన్‌ గిల్‌ (PC: BCCI)

సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా అంతర్జాతీయ క్రికెట్‌ బరిలో దిగేందుకు సిద్ధమైంది. దాదాపు రెండు నెలల పాటు ఐపీఎల్‌-2026 టోర్నీతో బిజీగా గడిపిన భారత ఆటగాళ్లు.. జూన్‌ 6 నుంచి జాతీయ జట్టు తరఫున విధుల్లో చేరనున్నారు.

స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టు ఆడే క్రమంలో ముల్లన్‌పూర్‌లో ఇప్పటికే ప్రాక్టీస్‌ మొదలుపెట్టిన ప్లేయర్లు.. నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీలో భారత్‌ అఫ్గన్‌తో టెస్టుతో పాటు.. మూడు వన్డేలు ఆడనుంది.

ప్రస్తుత అత్యుత్తమ జట్టు ఇదే
ఇలాంటి తరుణంలో టీమిండియా మాజీ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ జట్టు ఇదేనంటూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇందులో నలుగురు భారత క్రికెటర్లకు మాత్రమే చోటు దక్కింది.

తన జట్టులో కేఎల్‌ రాహుల్‌కు ఓపెనర్‌గా స్థానమిచ్చిన సంజయ్‌ బంగర్‌.. యశస్వి జైస్వాల్‌ను మాత్రం విస్మరించాడు. అతడికి బదులు ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్‌ ట్రవిస్‌ హెడ్‌ను రాహుల్‌కు జోడీగా ఎంపిక చేశాడు.

ఆసీస్‌, ఇంగ్లండ్‌ దిగ్గజాలకు చోటు
కాగా గతేడాది జైసూ ఏకంగా మూడు సెంచరీల సాయంతో 700కు పైగా పరుగులు చేశాడు. మరోవైపు.. హెడ్‌ 817, రాహుల్‌ 813 పరుగులు సాధించారు. ఇక వన్‌డౌన్‌లో ఇంగ్లండ్‌ లెజెండ్‌ జో రూట్‌ను ఎంపిక చేసిన సంజయ్‌ బంగర్‌.. నాలుగో స్థానానికి టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ను ఎంచుకున్నాడు. ఐదో స్థానంలో ఆసీస్‌ దిగ్గజం స్టీవ్‌ స్మిత్‌కు చోటు ఇచ్చాడు.

గతేడాది రూట్‌ 805 పరుగులతో సత్తా చాటగా.. స్మిత్‌ 651 రన్స్‌ రాబట్టాడు. వీరిద్దరి కంటే మెరుగ్గా గిల్‌.. ఏకంగా 983 పరుగులతో దుమ్ములేపాడు. ఇక తన జట్టులో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా బంగర్‌.. టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌కు స్థానమిచ్చాడు. ఇక ఏడో స్థానానికి ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ను ఎంపిక చేశాడు.

పేస్‌ దళంలో ఎవరంటే
అదే విధంగా స్పిన్నర్ల కోటాలో సౌతాఫ్రికా లెఫ్టార్మ్‌ బౌలర్‌ కేశవ్‌ మహరాజ్‌ను బంగర్‌ ఎంచుకున్నాడు. గతేడాది అతడు ఆరు మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 25 వికెట్లు పడగొట్టాడు. పేస్‌ దళంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌లతో పాటు టీమిండియా ప్రధాన బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు బంగర్‌ చోటిచ్చాడు.

ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ కంబైన్డ్‌ టెస్టు ప్లేయింగ్‌ ఎలెవన్‌ (సంజయ్‌ బంగర్‌)
కేఎల్‌ రాహుల్‌, ట్రవిస్‌ హెడ్‌, జో రూట్‌, శుబ్‌మన్‌ గిల్‌, స్టీవ్‌ స్మిత్‌, రిషభ్‌ పంత్‌, బెన్‌ స్టోక్స్‌, మిచెల్‌ స్టార్క్‌, ప్యాట్‌ కమిన్స్‌, కేశవ్‌ మహరాజ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా.

చదవండి: కావ్యా మారన్‌పై SRH ప్లేయర్‌ సంచలన ఆరోపణలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement