కావ్యా మారన్ (PC: BCCI/IPL)
ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఆరంభ మ్యాచ్‌లకు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరం కాగా.. దేశీ స్టార్ ఇషాన్ కిషన్ జట్టును ముందుకు నడిపించాడు. అతడి సారథ్యంలో జట్టు ఏడింట నాలుగు మ్యాచ్‌లు గెలిచింది.
ఇక కమిన్స్ తిరిగి వచ్చిన తర్వాత కూడా సన్‌రైజర్స్ హవా కొనసాగింది. మొత్తంగా ఈ సీజన్‌లో లీగ్ దశలో పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ హైదరాబాద్ జట్టు తొమ్మిది గెలిచి.. 18 పాయింట్లతో పట్టికలో టాప్-3లో నిలిచింది. తద్వారా ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించింది.
ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమి
అయితే, అనూహ్య రీతిలో ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడి.. సన్‌రైజర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విదేశీ ఆటగాళ్లు ఇంటిబాటపట్టారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ స్టార్ లియామ్ లివింగ్‌స్టోన్ సన్‌రైజర్స్ యాజమాన్యాన్ని (కావ్యా మారన్) ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశాడు.
తనకు తుదిజట్టులో చోటు దక్కకపోవడానికి కావ్యా మారన్ కారణమని పరోక్షంగా లివింగ్‌స్టోన్ వ్యాఖ్యానించాడు. స్టిక్ టు క్రికెట్ పాడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘ముంబై ఇండియన్స్‌కి అత్యవసరమైన ఓ ఆటగాడిని మా జట్టు కొనుగోలు చేసింది.
అతడిని అమితంగా ప్రేమిస్తారు
వేలం సమయంలో మా యాజమాన్యం పర్సులో బోలెడు డబ్బు ఉంది. కాబట్టి అతడిని సొంతం చేసుకోగలిగింది. మా యజమానులకు అతడంటే చాలా చాలా ఇష్టం. అతడిని అమితంగా ప్రేమిస్తారు. అందుకే జట్టులోకి తీసుకున్నారు.
మా కోచ్ డాన్ (డానియల్ వెటోరి) స్వయంగా నాతో ఈ మాట చెప్పాడు. అప్పుడే నాకో విషయం అర్థమైంది. ఎవరో ఒకరు గాయపడితే తప్ప నాకు తుదిజట్టులో చోటు దక్కదని తెలిసింది’’ అని లివింగ్‌స్టోన్ పేర్కొన్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో లివింగ్‌స్టోన్ ప్రస్తావించిన ఆటగాడు ఎవరా? అని నెట్టింట చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో చాలా మంది సలీల్ అరోరా పేరును తెరమీదకు తెస్తున్నారు.
ఆ ఆటగాడు ఎవరు?
పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల సలీల్ అరోరా వికెట్ కీపర్ బ్యాటర్. ఐపీఎల్-2026 మినీ వేలంలో సన్‌రైజర్స్- ముంబై ఇండియన్స్ అతడి కోసం పోటీ పడ్డాయి. ఈ క్రమంలో ఆఖరికి రూ. 1.5 కోట్లకు సన్‌రైజర్స్ సలీల్‌ను సొంతం చేసుకుంది.
సీజన్ ఆరంభ మ్యాచ్‌లో భాగంగా ఆర్సీబీతో పోరు సందర్భంగా సలీల్ అరోరా సన్‌రైజర్స్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆరో స్థానంలో బరిలోకి దిగి 9 పరుగులకే నిష్క్రమించాడు. సీజన్‌లో మొత్తంగా పదకొండు ఇన్నింగ్స్ ఆడి 156 పరుగులు చేశాడు.
ఇదిలా ఉంటే.. గతేడాది ఆర్సీబీ తరఫున ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఎనిమిది ఇన్నింగ్స్ ఆడి కేవలం 112 పరుగులే చేయడంతో పాటు రెండు వికెట్లు తీశాడు.
ఈ క్రమంలో ఆర్సీబీ అతడిని వదిలేయగా.. సన్‌రైజర్స్ ఊహించని రీతిలో రూ. 13 కోట్ల భారీ ధరకు లివింగ్‌స్టోన్‌ను కొనుగోలు చేసింది. కానీ ఈ సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌లే ఆడించగా.. అతడు 15 పరుగులు చేశాడు. బౌలింగ్ చేసే అవకాశమే రాలేదు.
Liam Livingstone reveals SRH owners interefered in team selection
"We bought a player Mumbai really wanted. We had more money, so we got him. The owners loved him, so he was locked in. Dan told me that, and I knew I wasn't getting a chance unless someone got injured."
Who is… pic.twitter.com/jvoyzgTgGa— Brutal Truth (@sarkarstix) June 3, 2026


