
లండన్‌లోని ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో 6 పరుగుల తేడాతో టీమిండియా సంచలన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీని 2-2తో భారత్ సమం చేసింది. 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 367 పరుగులకు ఆలౌటైంది.
ఆఖరి రోజు ఆటలో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్భుతం చేశాడు. ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు మూడు వికెట్లు అవసరమవ్వగా.. సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఓవరాల్‌గా సిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ప్రసిద్ద్ కృష్ణ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.
రూట్, బ్రూక్ సెంచరీలు వృథా..
ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(105), హ్యారీ బ్రూక్(111) అద్బుతమైన సెంచరీలతో రాణించారు. ఓ దశలో వీరిద్దరూ తమ జట్టును సునయాసంగా గెలిపించేలా కన్పించారు. కానీ ప్రత్యర్ధి జట్టు వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో కథ తారుమారైంది.
ఇంగ్లండ్ ఓటమిపాలవ్వడంతో రూట్, బ్రూక్ సెంచరీలు వృథా అయిపోయాయి. కాగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 224 పరుగులు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌ను 247 పరుగులకు ముగించింది.
ఆ తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం భారత్ అదరగొట్టింది. యశస్వి జైశ్వాల్(118) సెంచరీ, ఆకాష్ దీప్(66), రవీంద్ర జడేజా(53), వాషింగ్టన్ సుందర్(53) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ 396 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌కు 374 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్ధేశించింది. ఈ భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు చేధించడంలో చతికలపడింది.
చదవండి: IND vs ENG: ప్రతీకారం తీర్చుకున్న సిరాజ్.. ఓవల్‌లో భారత్ చారిత్రత్మక విజయం