ENG vs IND: విజయంతో ముగించేందుకు...

England vs India 3rd ODI Stats on 17 july 2022 - Sakshi

భారత్, ఇంగ్లండ్‌ జట్ల చివరి సమరం

నేడు మూడో వన్డే 

గెలిచే జట్టు ఖాతాలో సిరీస్‌

మ.గం.3.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌ గడ్డపై భారత జట్టు పర్యటన చివరి అంకానికి చేరింది. గత ఏడాది అర్ధాంతరంగా ఆగిన టెస్టు సిరీస్‌ను ఈ నెలారంభంలో ఓటమితో ముగించిన టీమిండియా ఆపై టి20 సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. వన్డే సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ముగిసేసరికి ఇరు జట్ల సమంగా నిలిచిన స్థితిలో ఆఖరి పోరు నిర్ణయాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో నేడు జరిగే మూడో వన్డేలో సత్తా చాటేందుకు భారత్, ఇంగ్లండ్‌ సన్నద్ధమయ్యాయి. తొలి మ్యాచ్‌ను 10 వికెట్ల తేడాతో గెలిచి రెండో మ్యాచ్‌లో 100 పరుగులతో ఓడిన రోహిత్‌ సేన చివరి సమరంలో సత్తా చాటుతుందా చూడాలి.  

ధావన్‌పై దృష్టి...
గత మ్యాచ్‌లో ఓడినా భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ విషయంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ మరో సారి కీలకం కానుండగా, అన్ని వైపులనుంచి విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్‌ కోహ్లి తన ఫేవరెట్‌ ఫార్మాట్‌లో ఎలా ఆడతాడనేది ఆసక్తికరం. రాబోయే వెస్టిండీస్‌ టూర్‌నుంచి కూడా దూరంగా ఉండనున్న కోహ్లి తన అసలు స్థాయి చూపేందుకు ఈ మ్యాచ్‌ సరైన అవకాశం కల్పిస్తోంది. అతను ఇక్కడ చెలరేగితే తిరుగుండదు. అయితే శిఖర్‌ ధావన్‌ ఆట కూడా ఆందోళన కలిగిస్తోంది. వచ్చే టూర్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించనున్న ధావన్‌ తన పాత శైలిలో దూకుడుగా ఆడలేకపోతున్నాడు.

తొలి వన్డేలో 54 బంతుల్లో 31 పరుగులు చేసిన అతను తర్వాతి మ్యాచ్‌లో 9 పరుగులు చేసేందుకు 26 బంతులు తీసుకున్నాడు. రోహిత్, ధావన్‌ సమష్టిగా చెలరేగితే భారత్‌కు శుభారంభం లభిస్తుంది. మిడిలార్డర్‌లో పంత్‌ తన దూకుడును ప్రదర్శించాల్సి ఉంది. సూర్యకుమార్, హార్దిక్, జడేజా మరోసారి బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. అయితే గత కొంత కాలంగా బౌలర్‌గా పూర్తిగా విఫలమవుతున్న జడేజా ఏమాత్రం ప్రభావం చూపిస్తాడో చూడాలి. బౌలింగ్‌లో బుమ్రా, షమీ ఖాయం కాగా గత మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన చహల్‌ మరోసారి ఇంగ్లండ్‌ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించగలడు. ప్రసిధ్‌ ఆకట్టుకున్నా...బ్యాటింగ్‌ను మరింత బలంగా మార్చేందుకు అతని స్థానంలో శార్దుల్‌ను ప్రయత్నించే అవకాశం ఉంది.  

అందరూ అంతంతే...
పేసర్‌ రీస్‌ టాప్లీ ఆరు వికెట్ల అద్భుత ప్రదర్శన ఇంగ్లండ్‌కు రెండో మ్యాచ్‌లో విజయాన్ని అందించింది కానీ లేకపోతే మరో పరాభవం మిగిలేది. ఘనత వహించిన బ్యాటింగ్‌ లైనప్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమైంది. ఒక్క బ్యాటర్‌ కూడా రెండు మ్యాచ్‌లలోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. స్వయంగా కెప్టెన్‌ బట్లర్‌ ఇబ్బందిపడుతుండగా, ఓపెనర్లు రాయ్, బెయిర్‌స్టో ప్రభావం చూపలేకపోతున్నారు. రూట్, స్టోక్స్‌ జట్టులోకి రావడంతో అదనంగా వచ్చిన ప్రయోజనం ఏమీ కనపడలేదు. లివింగ్‌స్టోన్‌ కూడా పెద్ద స్కోరు చేయాల్సి ఉంది. ఆల్‌రౌండర్లు విల్లీ, అలీ రెండో మ్యాచ్‌లో ఆదుకున్నారు. వీరిద్దరు ఈ సారి కూడా కీలక పాత్ర పోషించనున్నారు. బౌలింగ్‌లో టాప్లీతో పాటు ఇతర పేసర్లు రాణించాల్సి ఉంది. ఇంగ్లండ్‌ కూడా మార్పుల్లేకుండా అదే జట్టులో బరిలోకి దిగవచ్చు.

పిచ్, వాతావరణం
సాధారణ వికెట్‌. బ్యాటింగ్‌కు అనుకూలం. వర్షం సమస్య లేదు. ఓల్డ్‌ట్రఫోర్డ్‌ మైదానంలో గత 9 వన్డేల్లో ఎనిమిది సార్లు ముందుగా బ్యాటింగ్‌ చేసిన జట్లే గెలిచాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top