మూడో టెస్టుకు మలాన్‌ | Sakshi
Sakshi News home page

మూడో టెస్టుకు మలాన్‌

Published Thu, Aug 19 2021 5:32 AM

England canot keep going with Burns and Sibley at the top - Sakshi

లండన్‌: లార్డ్స్‌ టెస్టులో భారత్‌ చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్‌ మూడో టెస్టు కోసం తమ జట్టులో కొన్ని మార్పులు చేసింది. ఘోరంగా విఫలమవుతున్న ఓపెనర్‌ సిబ్లీని 15 మంది సభ్యుల జట్టునుంచి తప్పించి డేవిడ్‌ మలాన్‌ను ఎంపిక చేసింది. సరిగ్గా మూడేళ్ల క్రితం తన చివరి టెస్టు ఆడిన మలాన్‌... తాజా సీజన్‌లో ఒకే ఒక ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడి 199 పరుగులు చేశాడు. అయితే ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నంబర్‌వన్‌ స్థానంలో ఉన్న మలాన్‌ దూకుడైన బ్యాటింగ్‌ శైలి తమ జట్టుకు ఉపయోగపడగలదని భావిస్తున్న ఇంగ్లండ్‌ అతడిని టెస్టులోకి ఎంచుకునే సాహసం చేసింది. ఆగస్టు 25నుంచి లీడ్స్‌తో మూడో టెస్టు జరుగుతుంది.

రెండో స్థానానికి రూట్‌
దుబాయ్‌: భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ (893 రేటింగ్‌ పాయింట్లు) అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు నాలుగో స్థానంలో ఉన్న రూట్‌... రెండు, మూడు స్థానాల్లో ఉన్న స్టీవ్‌ స్మిత్‌ (891), లబ్‌షేన్‌ (878)లను వెనక్కి తోసి అగ్ర స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ తన(901) టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. టాప్‌–10లో భారత్‌నుంచి కోహ్లి, రోహిత్, పంత్‌ వరుసగా 5, 6, 7 స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్‌ (848 పాయింట్లు) తన రెండో స్థానాన్ని నిలబెట్టుకోగా, జస్‌ప్రీత్‌ బుమ్రా 9నుంచి 10వ స్థానానికి పడిపోయాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా కూడా ఒక స్థానం దిగజారి 3వ ర్యాంక్‌కు చేరుకోగా, అశ్విన్‌ తన 4వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement