
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ సిరీస్‌లో 1000 బంతులు వేసిన తొలి బౌలర్‌గా (ఇరు జట్ల తరఫున) అవతరించాడు. అలాగే 2002 జూన్ నుంచి ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ల్లో అత్యధిక బంతులు బౌల్ చేసిన భారత ఫాస్ట్ బౌలర్‌గానూ నిలిచాడు.
ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్‌లో ఈ ఘనతలు సాధించాడు. ఈ సిరీస్‌లో సిరాజ్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ కొనసాగుతున్నాడు. 5 మ్యాచ్‌ల్లో సిరాజ్ 20 వికెట్లు పడగొట్టాడు.
ఐదో టెస్ట్ విషయానికొస్తే.. రసవత్తరంగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో చివరి రోజు ఇంగ్లండ్ గెలవాలంటే 35 పరుగులు, భారత్ గెలుపుకు నాలుగు వికెట్లు కావాలి. నాలుగో రోజు వెలుతురులేమి కారణంగా ఆటను గంట ముందుగా నిలిపి వేశారు.
374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. క్రాలే (14), డకెట్ (54), ఓలీ పోప్ (27), బ్రూక్ (111), జో రూట్ (105), జేకబ్ బేతెల్ (5) ఔట్ కాగా.. జేమీ స్మిత్ (2), జేమీ ఓవర్టన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 3, సిరాజ్ 2, ఆకాశ్‌దీప్ ఓ వికెట్ తీశారు.
అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.
దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది.