
టీమిండియాతో ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ భుజం గాయం కారణంగా మ్యాచ్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
వోక్స్ తొలి రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే ప్రయత్నంతో అతని భుజానికి తీవ్ర గాయమైంది. జేమీ ఓవర్టన్ వేసిన 57వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఓవర్‌లో ఐదో బంతిని కరుణ్ నాయర్ మిడాఫ్ దిశగా షాట్ ఆడగా.. వోక్స్ బంతిని ఆపేందుకు పరిగెత్తుకుంటా వెళ్లాడు. ఆ ప్రయత్నంలో వోక్స్ ఎడమ భుజం నేలకు బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిలలాడిపోయాడు. వెంటనే ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. స్కానింగ్ తీయగా బలమైన గాయమని తేలింది.
దీంతో అతను ఐదో టెస్ట్ నుంచి అర్దంతరంగా వైదొలిగాడు. ఈ మ్యాచ్‌లో వోక్స్ లేని లోటు ఇంగ్లండ్ విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది. ఇంగ్లండ్ తమ స్టార్ పేసర్లు బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ లేకుండానే ఈ మ్యాచ్ బరిలోకి దిగింది. తాజాగా వోక్స్ కూడా దూరం కావడంతో ఇంగ్లండ్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనపడినైట్లంది.
ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడిన వోక్స్ 181 ఓవర్లు వేసి 11 వికెట్లు తీశాడు. గాయపడటానికి ముందు కూడా వోక్స్ ఓ వికెట్ తీశాడు. టీమిండియా తరుపుముక్క అయిన కేఎల్ రాహుల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్‌మన్ గిల్ 21, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19 పరుగులు చేసి ఔట్ కాగా.. కరుణ్ నాయర్ (52), వాషింగ్టన్ సుందర్ (19) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, టంగ్ తలో 2 వికెట్లు తీయగా.. వోక్స్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. గిల్ రనౌటయ్యాడు.