నేటి నుంచి దేశవాళీ ఫస్ట్‌క్లాస్ టోర్నీ
బరిలో పలువురు టెస్టు క్రికెటర్లు
న్యూఢిల్లీ: జాతీయ జట్టులో స్థానం కోసం పోటీ పడుతున్న కుర్రాళ్లు... పునరాగమనం చేసేందుకు ప్రయత్నిస్తున్న సీనియర్లు... అంతర్జాతీయ మ్యాచ్‌లకు ముందు ఎరుపు బంతితో ప్రాక్టీస్ కోసం రెగ్యులర్ టెస్టు క్రికెటర్లు... ఇలా ప్రతీ జట్టులో పలువురు ఆటగాళ్లకు ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ కీలకంగా మారింది. మొత్తం 38 టీమ్‌లు పాల్గొంటున్న ఈ టోర్నీ నేడు (ఆదివారం) ప్రారంభం కానుంది. టోర్నీ తొలి రోజు అన్నీ జట్లూ బరిలోకి దిగుతుండటంతో మొత్తం 19 మ్యాచ్‌లు ప్రారంభం కానుండటం విశేషం. 32 ఎలీట్ జట్లను నాలుగు గ్రూప్‌లు ఎ, బి, సి, డి లుగా విభజించగా... మరో 6 టీమ్‌లు ప్లేట్ గ్రూప్‌లో ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్‌గా మైదానంలోకి అడుగు పెట్టనున్న జమ్మూ కశ్మీర్ తమ మొదటి మ్యాచ్‌లో మాజీ చాంపియన్ మధ్యప్రదేశ్‌తో తలపడనుంది.
భారత టెస్టు జట్టులో రెగ్యులర్ సభ్యులైన కేఎల్ రాహుల్ (కర్ణాటక), యశస్వి జైస్వాల్ (ముంబై), వాషింగ్టన్ సుందర్ (తమిళనాడు), రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర) టోర్నీ తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగుతూ తమ ఆటకు పదును పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సత్తా చాటిన లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ (రాజస్థాన్), హర్ష్ దూబే (విదర్భ)లాంటి ఆటగాళ్లకు కూడా ఈ పోరు కీలకం కానుంది. టెస్టు తుది జట్టులో స్థానాన్ని ఆశిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ మరోసారి ముంబై తరఫున భారీగా పరుగులు సాధించాలని పట్టుదలగా ఉన్నాడు.
అసాధారణ ప్రదర్శనతో జమ్ము కశ్మీర్‌కు టైటిల్ అందించడంతో అందరి దృష్టిలో పడి వన్డేల్లో అరంగేట్రం చేసిన ఆఖిబ్ నబీ... కివీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక కావాలనే లక్ష్యంతో మరోసారి చెలరేగాలని భావిస్తున్నాడు. అన్నింటికి మించి సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ (బెంగాల్) తన పోరాటాన్ని ఆపడం లేదు. గత సీజన్‌లో 37 వికెట్లతో ఆకట్టుకున్న షమీ టెస్టుల్లో పునరాగమనం చేయాలని పట్టుదలగా ఉన్నాడు. టి20ల్లో నాలుగేళ్ల తర్వాత భువనేశ్వర్ కుమార్‌కు పిలుపు లభించడం షమీలో కొత్త ఆశలు రేపుతోంది. మరో సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ ఈ సారి పంజాబ్ జట్టు తరఫున ప్లేయర్ కం మెంటార్‌గా ఆడనున్నాడు.
92 తాజా రంజీ ట్రోఫీ 92వది కానుంది. గత 91 టోర్నీల్లో బాంబే/ముంబై అత్యధికంగా 42 సార్లు విజేతగా నిలవగా, మైసూర్/ కర్నాటక 8 సార్లు గెలిచి రెండో స్థానంలో ఉంది.
హైదరాబాద్ X త్రిపుర
ఆంధ్ర X కర్నాటక
కొత్త సీజన్‌లో హైదరాబాద్, ఆంధ్ర జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. గ్రూప్ ‘బి’లో భాగంగా హైదరాబాద్‌లోని జింఖానా మైదానంలో జరిగే మ్యాచ్‌లో త్రిపురతో హైదరాబాద్ తలపడుతుంది. భారత టాప్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ నాయకత్వంలో ఆడనున్న హైదరాబాద్...బలహీన ప్రత్యర్థిని సొంతగడ్డపై ఓడించి పాయింట్ల ఖాతా తెరవాలని పట్టుదలగా ఉంది. మిలింద్, అభిరథ్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్‌లతో జట్టు పటిష్టంగా ఉంది.
సీనియర్ ప్లేయర్ హనుమ విహారి త్రిపుర తరఫున ఎలా రాణిస్తాడనేది చూడాలి. మరో వైపు ‘బి’ గ్రూప్‌లోనే ఉన్న ఆంధ్ర జట్టు విజయవాడ (మూలపాడు) మైదానంలో అగ్రశ్రేణి జట్టు కర్ణాటకను ఎదుర్కొంటుంది. రికీ భుయ్ కెప్టెన్సీలోని ఆంధ్ర టీమ్‌లో షేక్ రషీద్, సౌరభ్ కుమార్, త్రిపురాన విజయ్ కీలకం కానున్నారు. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, మయాంక్ అగర్వాల్, స్మరణ్‌లతో జట్టు బలంగా కనిపిస్తోంది. గత సీజన్‌లో ఆంధ్ర క్వార్టర్ ఫైనల్‌కు చేరగా, ఆడిన 7 మ్యాచ్‌లలో ఒకటే గెలిచిన హైదరాబాద్ లీగ్ దశకే పరిమితమైంది.


