అభిమానుల మనసు గెలుచుకున్న ధోని

Dhoni Gives Up Business Class Seat To CSK Director On Flight To UAE - Sakshi

దుబాయ్‌ : భారత మాజీ ఆటగాడు ఎంఎస్‌ ధోని అభిమానుల మనసు మరోసారి గెలుచుకున్నాడు. ఐపీఎల్‌ 13వ సీజన్‌ దుబాయ్‌లో సెప్టెంబర్‌ 19 నుంచి జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లీగ్‌లో పాల్గొనేందుకు జట్లన్నీ దుబాయ్‌కు చేరుకుంటున్నాయి. కాగా ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ ‌కింగ్స్‌ శుక్రవారం ప్రత్యేక విమానంలో దుబాయ్‌కు  బయలుదేరి వెళ్లింది. జట్టుతో పాటే సీఎస్‌కే మేనేజర్‌ కె జార్జ్‌ జాన్‌ కూడా వెళ్లారు. అయితే విమాన ప్రయాణంలో ధోనితో జరిగిన ఒక ఆసక్తికర సన్నివేశాన్ని జార్జ్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసుకున్నాడు. (చదవండి : 'ధోని ఎంపిక లెక్కలకు అందని సూత్రం')

ధోనికి కేటాయించిన బిజినెస్‌ క్లాస్‌ సీటులో తనను కూర్చోబెట్టి.. ధోని మాత్రం ఎకానమీ సీటులో వెళ్లి కూర్చున్నాడని జార్జ్‌ పేర్కొన్నాడు. ఇదే విషయం ధోనిని అడిగితే..' మీ కాళ్లు చాలా పెద్దగా ఉన్నాయి.. మీకు ఎకానమీ క్లాస్‌ సీటు సరిపోదు.. వచ్చి నా బిజినెస్‌ క్లాస్‌ సీటులో కూర్చొండి.. నేను వెళ్లి మీ సీటులో కూర్చుంటా అని చెప్పాడు.  తన సహచరులతో కలిసి కూర్చునేందుకే  ధోని ఇదంతా చేశాడని జార్జ్‌ ఫన్నీగా పేర్కొన్నాడు. జార్జ్‌ చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ధోని ఎప్పుడైనా కూల్‌గానే ఉంటాడు.. ధోని లాంటి వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఆడేందుకు కోల్‌కతా నైటరైడర్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌, కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌లు ముందే చేరుకోగా.. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లు శుక్రవారం దుబాయ్‌కి చేరుకున్నాయి. మిగతా రెండు ఫ్రాంచైజీలు సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ వారంతంలోగా యూఏఈ చేరుకునే అవకాశముంది యూఏఈ వచ్చే ముందు ఆటగాళ్లందరికి పలుమార్లు కోవిడ్‌ టెస్టులు చేశారు. ఇప్పుడు వీరిని ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతారు. మళ్లీ ఈ 6 రోజుల్లోనే మూడు సార్లు కరోనా పరీక్షలు చేస్తారు. క్వారంటైన్‌ తొలి రోజు, మూడో రోజు, ఆఖరి రోజు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మూడింటిలో నెగెటివ్‌ ఫలితాలు వచ్చిన వారే జీవ రక్షణ వలయం (బయో బబుల్‌)లోకి వెళ్తారు. ఈ బుడగలో ఉన్నప్పటికీ టోర్నీ జరిగినంత కాలం ప్రతీ ఐదు రోజులకోసారి పరీక్షల తంతు జరుపుతూనే ఉంటారు. సెప్టెంబర్‌ 19 నుంచి జరగనున్న ఐపీఎల్13వ సీజన్‌లో మొత్తం 60 మ్యాచ్‌లు 53 రోజుల పాటు దుబాయ్, అబుదాబీ, షార్జా మూడు వేదికల్లో నిర్వహిస్తారు.(చదవండి : అతను ఉంటే వరల్డ్‌కప్‌ గెలిచేవాళ్లం: రైనా)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top