అతను ఉంటే వరల్డ్‌కప్‌ గెలిచేవాళ్లం: రైనా

Suresh Raina Comments About Ambati Rayudu Over 2019 World Cup Squad - Sakshi

న్యూఢిల్లీ: హైదరాబాదీ క్రికెటర్‌ అంబటి రాయుడు గనుక 2019- వరల్డ్‌కప్‌ స్వ్కాడ్‌లో ఉండి ఉంటే టీమిండియా కప్‌ గెలుచుకునేదని మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా అభిప్రాయపడ్డాడు. రాయుడు కష్టపడే తత్వం గలవాడని, బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాలుగో స్థానానికి అతడే సరైన ఎంపిక అంటూ ఆనాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు. కాగా గతేడాది జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ భారత జట్టులో చోటు కోసం ఎంతగానో ఎదురు చూసిన అంబటి రాయుడికి సెలక్టర్లు మొండిచేయి చూపిన సంగతి తెలిసిందే. అప్పటికి మెరుగైన రికార్డు ఉన్నప్పటికీ రాయుడిని పక్కనపెట్టి అతడి స్థానంలో విజయ్‌ శంకర్‌కు అవకాశమివ్వడం క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక ఈ తమిళనాడు క్రికెటర్‌ను ఎంపిక చేయడాన్ని సమర్థించుకుంటూ శంకర్‌ 3డీ ప్లేయర్‌(బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌) అంటూ సెలక్టర్‌ ఎంఎస్‌కే చేసిన కామెంట్స్‌పై రాయుడు కూడా అంతే ఘాటుగా స్పందించడం వివాదానికి దారితీసింది.(రైనాకూ ప్రధాని లేఖ )

ఈ నేపథ్యంలో విజయ్‌ శంకర్‌ గాయంతో తిరిగి స్వదేశానికి వచ్చిన్పటికీ మరోసారి రాయుడికి హ్యాండిచ్చిన సెలక్టర్లు.. రిషభ్‌  పంత్‌ను ఇంగ్లండ్‌కు పిలిపించారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించి.. కొన్నాళ్ల తర్వాత తన మాట వెనక్కి తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆనాటి పరిస్థితుల గురించి క్రిక్‌బజ్‌తో మాట్లాడిన సురేశ్‌ రైనా.. ‘‘ రాయుడు కష్టపడే తత్వం ఉన్నవాడు. తననెప్పుడూ నంబర్‌.4 ప్లేస్‌లో చూడాలని భావించేవాడిని. నిజానికి 2018 నాటి టూర్‌ను నేను ఏమాత్రం ఆస్వాదించలేకపోయాను. అప్పుడు రాయుడు ఫిట్‌నెస్‌ టెస్టులో విఫలం కావడంతో తన స్థానంలో నన్ను సెలక్ట్‌ చేయడం అంతగా నచ్చలేదు. అంతేకాదు ప్రపంచ కప్‌ సమయంలో కూడా తను జట్టుతో లేకపోవడం ప్రభావం చూపింది.('రైనా.. ఆఫ్రిదిలా యూటర్న్‌ తీసుకో')

ఒకవేళ తను ఉండి ఉంటే మేం టోర్నమెంట్‌ గెలిచేవాళ్లం. చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడే సమయంలో తన ఆటను దగ్గరగా గమనించాను. తనెంతో బాగా బ్యాటింగ్‌ చేస్తాడు’’అని రాయుడికి విషయంలో సెలక్టర్లు వ్యవహరించిన తీరును పరోక్షంగా ప్రస్తావించాడు. ఇక 2019 వరల్డ్‌ కప్‌లో లీగ్ దశలో అగ్రగామిగా నిలిచిన భారత్‌ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి పాలై ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top