'రైనా.. ఆఫ్రిదిలా యూటర్న్‌ తీసుకో'

Aakash Chopra Jokes While Urging Suresh Raina To Reconsider Retirement - Sakshi

ముంబై : టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, సీనియర్‌ క్రికెటర్‌ సురేశ్‌ రైనా ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు నిమిషాల వ్యవధిలో వీడ్కోలు పలికి క్రికెట్‌ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశారు. వీరిద్దరు ఆటకు గుడ్‌బై చెప్పి ఐదు రోజులు కావొస్తున్నా.. ఇప్పటికీ ఏదో ఒక చోట ఇదే విషయం గురించి చర్చ జరగుతూనే ఉంది. రైనా వీడ్కోలుపై మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా  గురువారం స్పందించిన విషయం తెలిసిందే. రైనా లాంటి ఆటగాడు 33 ఏళ్లకే వీడ్కోలు పలకడం సరికాదని, అదసలు రిటైర్మెంట్‌ వయసే కాదన్నాడు. మిడిల్‌ ఆర్డర్‌లో రైనాను ఏ స్థానంలో పంపించినా జట్టుకు విజయాలే అందించాడని, అయితే అతడికి సరైన అవకాశాలు రాలేదని ఆకాశ్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఆకాశ్‌ చోప్రా మరోసారి రైనా గురించి తన యూట్యూబ్‌ చానెల్‌లో ఆసక్తిగా స్పందించాడు.

'రైనా నీ నిర్ణయాన్ని మరోసారి పరిశీలించు.. రిటైర్మెంట్‌ విషయంలో పాక్‌ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రదిని అనుసరించు..రిటైర్మెంట్‌ విషయంలో అతను ఎన్నోసార్లు యూ-టర్న్‌ తీసుకున్నాడు. నువ్వు కూడా ఆఫ్రిదిలా యూ టర్న్‌ తీసుకుంటే బాగుండు' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. కాగా ధోని, రైనాల రిటైర్మెంట్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇరువురు ఆటగాళ్లకు లేఖ ద్వారా తన సందేశాన్ని పంపిన సంగతి తెలిసిందే. మీ ప్రతిభతో దేశానికి ఎంతో సేవ చేశారు.. మీ సేవలను ఈ దేశం ఎన్నటికీ మరిచిపోదు అంటూ మోదీ లేఖలో పేర్కొన్నారు. 13 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టి20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో ఒక సెంచరీ, 7 అర్ధ సెంచరీలతో కలిపి 768 పరుగులు... వన్డేల్లో 5 సెంచరీలు, 36 అర్ధ సెంచరీలతో కలిపి 5,615 పరుగులు... టి20ల్లో ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలతో కలిపి 1,605 పరుగులు సాధించాడు.

ఇక షాహిద్‌ ఆఫ్రిది విషయానికి వస్తే కెరీర్‌ మొత్తం వివాదాలతోనే నడిచింది. మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన ఆఫ్రిది 2011లో పీసీబీతో తలెత్తిన వివాదంతో ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. దీనిని సీరియస్‌గా తీసుకున్న పీసీబీ సెంట్రల్‌ కాంట్రాక్టును రద్దు చేయడంతో పాటు 4.5 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించింది. పీసీబీ బోర్డును ప్రక్షాలన చేస్తే తాను మళ్లీ జట్టులోకి వస్తానని ఆఫ్రిది అ‍ప్పట్లో మీడియా ఎదుట వాపోయాడు. అయితే పీసీబీ చైర్మన్‌గా ఇలియాజ్‌ భట్‌ పదవి చేపట్టిన తర్వాత తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకొని మళ్లీ జట్టులోకి వచ్చాడు. అలా ఆఫ్రిది కెరీర్‌ మొత్తం ఒడిదుడుకుల మధ్య సాగింది.

చదవండి :
థ్యాంక్యూ నరేంద్ర మోదీజీ : రైనా
'ధోని ఎంపిక లెక్కలకు అందని సూత్రం'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top