దీపిక... వరల్డ్‌ నంబర్‌వన్‌

Deepika Kumari reclaims No1 spot in world archery rankings - Sakshi

తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ‘టాప్‌’ ర్యాంక్‌లోకి భారత ఆర్చర్‌

వరల్డ్‌కప్‌లో స్వర్ణం గెలవడంతో ర్యాంకింగ్స్‌లో పురోగతి  

పారిస్‌: ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–3 టోర్నీలో మహిళల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించినందుకు భారత స్టార్‌ ఆర్చర్‌ దీపిక కుమారికి తగిన ప్రతిఫలం లభించింది. సోమవారం విడుదల చేసిన తాజా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 27 ఏళ్ల దీపిక రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అధిరోహించింది. ఈ టోర్నీకి ముందు మూడో ర్యాంక్‌లో ఉన్న దీపిక తాజా ప్రదర్శనతో రెండు స్థానాలు పురోగతి సాధించి 263.7 పాయింట్లతో ‘టాప్‌’ ర్యాంక్‌ను అందుకుంది.

లీసా బార్‌బెలిన్‌ (ఫ్రాన్స్‌–225.5 పాయింట్లు) తొలి ర్యాంక్‌ నుంచి రెండో ర్యాంక్‌కు పడిపోగా... కాంగ్‌ చె యంగ్‌ (దక్షిణ కొరియా–208 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో నిలిచింది. తొలిసారి 2012లో వరల్డ్‌ నంబర్‌వన్‌గా నిలిచిన దీపిక ఆ తర్వాత నిలకడగా టాప్‌–10లో కొనసాగింది. పారిస్‌లో ఆదివారం ముగిసిన ప్రపంచకప్‌ స్టేజ్‌–3 టోర్నీలో దీపిక రికర్వ్‌ టీమ్‌ విభాగంలో, మిక్స్‌డ్‌ విభాగంలో, వ్యక్తిగత విభాగంలో స్వర్ణాలు నెగ్గి ఒకే ప్రపంచకప్‌లో మూడు బంగారు పతకాలు గెలిచిన తొలి భారతీయ ఆర్చర్‌గా రికార్డు నెలకొల్పింది.

తన 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో దీపిక అన్ని ప్రతిష్టాత్మక  టోర్నీలలో పతకాలు సాధించింది. కేవలం ఒలింపిక్‌ పతకం మాత్రమే ఆమెను ఊరిస్తోంది. ప్రపంచకప్‌ టోర్నీలలో 35 పతకాలు... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదు పతకాలు... కామన్వెల్త్‌ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు, ఆసియా క్రీడల్లో ఒక పతకం... ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆరు పతకాలు ఆమె

సాధించింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో టీమ్‌ విభాగంలో తొలి రౌండ్‌లో... వ్యక్తిగత విభాగంలో తొలి రౌండ్‌లో వెనుదిరిగిన దీపిక 2016 రియో ఒలింపిక్స్‌లో టీమ్‌ విభాగంలో క్వార్టర్‌ ఫైనల్లో... వ్యక్తిగత విభాగంలో మూడో రౌండ్‌లో ఓడిపోయింది. వచ్చే నెలలో జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో దీపిక కేవలం వ్యక్తిగత విభాగంలో పోటీపడనుంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top