సూపర్‌ మార్కెట్‌లో టీమిండియా క్రికెటర్‌ గొడవ | Cricketer Rajeshwari Gayakwad Physical Altercation Supermart Employee | Sakshi
Sakshi News home page

Rajeshwari Gayakwad: సూపర్‌ మార్కెట్‌లో టీమిండియా క్రికెటర్‌ గొడవ

Dec 1 2022 9:28 PM | Updated on Dec 1 2022 9:55 PM

Cricketer Rajeshwari Gayakwad Physical Altercation Supermart Employee - Sakshi

టీమిండియా మహిళా క్రికెటర్‌ రాజేశ్వరి గైక్వాడ్‌ తన చర్యలతో వార్తల్లో నిలిచింది. ఒక సూపర్‌ మార్కెట్‌లో సిబ్బందితో గొడవపడింది. తన స్నేహితులతో కలిసి సూపర్‌ మార్కెట్‌కు వచ్చిన ఆమె ఏదో విషయమై సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. కాసేపటికే ఆ గొడవ పెద్దదిగా మారింది. ఎంతలా అంటే రాజేశ్వరి గైక్వాడ్‌ కోపంతో ఊగిపోతూ వారిపై దాడి చేసే వరకు వెళ్లింది. కర్నాటకలోని బీజాపూర్‌లో ఈ ఘటన జరిగింది.

గొడవ చేసిన తర్వాత రాజేశ్వరి గైక్వాడ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయినప్పటికి తర్వాత ఆమె సన్నిహితులు వచ్చి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ గొడవకు సంబంధించిందంతా అక్కడి సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయింది.దీంతో సూపర్‌ మార్కెట్‌ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించారు. అయితే ఆ తర్వాత రాజేశ్వరితోపాటు సూపర్‌ మార్కెట్‌ సిబ్బంది సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్నారు. ఈ గొడవకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు.

2014లో ఇండియా తరఫున శ్రీలంకతో మ్యాచ్‌ ద్వారా రాజేశ్వరి గైక్వాడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. 2017లో వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్ చేరిన ఇండియన్‌ టీమ్‌లో రాజేశ్వరి సభ్యురాలు. అదే వరల్డ్‌కప్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన కూడా చేసింది. మహిళల క్రికెట్‌ వరల్డ్‌కప్‌ చరిత్రలో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఇండియా తరఫున అత్యుత్తమ గణాంకాలు (5/15) నమోదు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement