బుమ్రా విషయంలో ఇంగ్లండ్‌ బృందం 'అతి'పై మండిపడ్డ మైఖేల్‌ వాన్‌

Coach Chris Silverwood Should Have Asked Joe Root, Michael Vaughan Slams English Men Over Bumrah Episode - Sakshi

లండన్‌: లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా పేసర్ బుమ్రాను టార్గెట్‌ చేస్తూ ఇంగ్లండ్ పేసర్లు అతిగా(వరుసగా బౌన్సర్లు సంధించడాన్ని) ప్రవర్తించడాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తప్పుబట్టాడు. ఈ విషయంలో క్రికెట్‌ విలువలకు తూట్లు పొడిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్ రూట్‌ను ఆ జట్టు కోచ్ సిల్వర్ వుడ్ మందలించకపోవడంపై మండిపడ్డాడు. మైదానంలో కెప్టెన్‌ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు అడ్డుకోవాల్సిన బాధ్యత కోచ్‌పై ఉంటుందని పేర్కొన్నాడు.

డ్రింక్స్‌ బ్రేక్‌లో కోచ్‌ ఎవరినైనా మైదానంలోకి పంపి బౌన్సర్లు వేయకుండా అడ్డుకొని ఉండాల్సిందని తెలిపాడు. తాను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఏదైనా నిర్ణయాలు తీసుకోలేకపోతే, నాటి కోచ్‌ డంకన్‌ ఫ్లెచర్‌ ఇలాగే సందేశాలు పంపేవాడని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్‌ ఓటమికి కోచ్‌ సిల్వర్‌వుడ్‌ బాధ్యత లేమి మరో కారణమని ఆరోపించాడు. ఏదిఏమైనా బుమ్రాను టార్గెట్‌ చేసి మ్యాచ్‌ను గాలికొదిలేసిన రూట్‌ సేన తగిన మూల్యమే చెల్లించుకుందన్నాడు. ఫేస్‌బుక్ వేదికగా ఓ పోస్ట్ చేసిన వాన్.. బుమ్రా విషయంలో ఇంగ్లండ్‌ అతి ప్రవర్తనపై విమర్శలు గుప్పించాడు. 

ఐదో రోజు ఆటలో లంచ్ బ్రేక్‌కు ముందు 20 నిమిషాల ఆటనే(బుమ్రాను టార్గెట్‌ చేయడం) ఇంగ్లండ్‌ కొంపముంచిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వాన్‌.. గత కొన్నేళ్లుగా ఇంగ్లండ్‌ ఇలా చేయడం నేనెప్పుడూ చూడలేదని అన్నాడు. దీన్ని ఓ పనికిమాలిన చర్యగా అభివర్ణించిన ఈ ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌.. కోచ్‌ సహా ఇంగ్లండ్‌ బృందంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు.

ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లి సరైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాడని ప్రశంశించిన వాన్‌.. భారత్‌ బృందాన్ని ఆకాశానికెత్తాడు. కాగా, లార్డ్స్ టెస్ట్‌లో  టీమిండియా 151 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసి చిరస్మరణీయ విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచిన భారత్‌.. ఈనెల 25న లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌ ఢీకొట్టనుంది.  
చదవండి: మ్యాచ్‌ మధ్యలో ఆ టాప్‌ టెన్నిస్‌ స్టార్‌ ఏం చేశాడో చూడండి..
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top