ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy-2025) భాగంగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ (South Africa Vs New Zealand) జట్ల మధ్య ఇవాళ (మార్చి 5) రెండో సెమీఫైనల్ జరుగుతుంది. లాహోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 33 ఓవర్ల అనంతరం న్యూజిలాండ్ స్కోర్ 212/1గా ఉంది. విల్ యంగ్ (21) ఔట్ కాగా.. రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (80) క్రీజ్‌లో ఉన్నారు. విల్ యంగ్ వికెట్ లుంగి ఎంగిడికి దక్కింది.
కాగా, ఈ ఇన్నింగ్స్‌లో 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేన్ విలియమ్సన్ (Kane Williamson) ఓ అరుదైన మైలురాయిని తాకాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 19000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేన్ తన 370వ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం కేన్ ఖాతాలో 47 సెంచరీలు, 103 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
కేన్ ఒక్క వన్డేల్లోనే 164 ఇన్నింగ్స్‌ల్లో 14 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీల సాయంతో 7185 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో 186 ఇన్నింగ్స్‌ల్లో 33 సెంచరీలు, 37 అర్ద సెంచరీల సాయంతో 9276 పరుగులు.. 93 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 18 హాఫ్ సెంచరీల సాయంతో 2575 పరుగులు చేశాడు.
ఓవరాల్‌గా 16వ ఆటగాడు
అంతర్జాతీయ క్రికెట్‌లో 19000 పరుగులు పూర్తి చేసుకున్న 12వ ఆటగాడిగా కేన్ రికార్డుల్లోకెక్కాడు. కేన్‌కు ముందు సచిన్ (34357), సంగక్కర (28016), విరాట్ కోహ్లి (27598), రికీ పాంటింగ్ (27483), జయవర్దనే (25957), జాక్ కల్లిస్ (25534), రాహుల్ ద్రవిడ్ (24208), బ్రియాన్ లారా (22358), సనత్ జయసూర్య (21032), శివ్‌నరైన్ చంద్రపాల్ (20988), జో రూట్ (20724), ఇంజమామ్ ఉల్ హక్ (20580), ఏబీ డివిలియర్స్ (20014), రోహిత్ శర్మ (19624), క్రిస్ గేల్ (19593) ఈ ఘనత సాధించారు. 19000 పరుగుల మైలురాయిని తాకే క్రమంలో కేన్ డేవిడ్ వార్నర్‌ను (18995) అధిగమించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేన్ తర్వాత అత్యధికంగా రాస్ టేలర్ 18199 పరుగులు చేశాడు. స్టీఫెన్ ఫ్లెమింగ్ 15289 పరుగులు సాధించాడు. ప్రస్తుతం కేన్ న్యూజిలాండ్ తరఫున అత్యధిక సెంచరీలు (47) చేసిన ఆటగాడిగానూ రికార్డు కలిగి ఉన్నాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కేన్.. మూడు ఫార్మాట్లలో తనదైన ముద్ర వేసి ఈ తరం ఫాబ్ ఫోర్‌లో ఒకడిగా కొనసాగుతున్నాడు.
కాగా, ప్రస్తుతం సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో విజేత దుబాయ్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మార్చి 9న జరుగనుంది. భారత్.. తొలి సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసి వరుసగా మూడోసారి, ఓవరాల్‌గా ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.


