బెస్ట్‌ అల్‌కరాజ్, సబలెంకా | Carlos Alcaraz and Aryna Sabalenka led the winners at the Laureus Awards 2026 | Sakshi
Sakshi News home page

బెస్ట్‌ అల్‌కరాజ్, సబలెంకా

Apr 22 2026 1:18 AM | Updated on Apr 22 2026 1:18 AM

Carlos Alcaraz and Aryna Sabalenka led the winners at the Laureus Awards 2026

లారియస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌ అవార్డుల ప్రదానం

టెన్నిస్‌ ప్లేయర్లకే పురుషుల, మహిళల విభాగాల్లో ఉత్తమ క్రీడాకారుల పురస్కారాలు

భారత మహిళల క్రికెట్‌ జట్టుకు నిరాశ  

మాడ్రిడ్‌: క్రీడా ప్రపంచంలో అస్కార్‌ అవార్డులుగా భావించే లారియస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక ఈ కార్యక్రమం జరిగింది. 2025 సంవత్సరానికి గాను పురుషుల విభాగంలో ఉత్తమ క్రీడాకారుడిగా స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌... మహిళల విభాగంలో ఉత్తమ క్రీడాకారిణిగా బెలారూస్‌ టెన్నిస్‌ స్టార్‌ సబలెంకా పురస్కారాలు అందుకున్నారు. 2000 సంవత్సరం నుంచి లారియస్‌ అవార్డులు ప్రతియేటా ఇస్తున్నారు. 

గత ఏడాది అల్‌కరాజ్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్, యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తోపాటు మరో ఆరు టోర్నీల్లో విజేతగా నిలిచాడు. ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన ఈ స్పెయిన్‌ స్టార్, వింబుల్డన్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా 71 మ్యాచ్‌ల్లో గెలిచి, 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. 2026 సీజన్‌ను కూడా అల్‌కరాజ్‌ ఘనంగా ప్రారంభించాడు. ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో తొలిసారి టైటిల్‌ గెలిచి టెన్నిస్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సొంతం చేసుకొని ‘కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌’ ఘనత సాధించాడు. 

గతవారం బార్సిలోనా ఓపెన్‌ టోర్నీలో మణికట్టు గాయానికి గురైన అల్‌కరాజ్‌ మాడ్రిడ్‌ మాస్టర్స్‌ టోర్నీ నుంచి వైదొలిగాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకుంటేనే ఫ్రెంచ్‌ ఓపెన్‌ బరిలోకి దిగుతానని 22 ఏళ్ల అల్‌కరాజ్‌ వ్యాఖ్యానించాడు. రోజర్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా), రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) తర్వాత ‘లారియస్‌ స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు గెల్చుకున్న నాలుగో టెన్నిస్‌ ప్లేయర్‌గా అల్‌కరాజ్‌ గుర్తింపు పొందాడు. 

మరోవైపు మహిళల టెన్నిస్‌ నంబర్‌వన్‌ సబలెంకా కూడా గతేడాది నిలకడగా రాణించింది. యూఎస్‌ ఓపెన్‌లో టైటిల్‌ నెగ్గిన సబలెంకా ఆ్రస్టేలియన్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. సీజన్‌ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ టోర్నీలోనూ రన్నరప్‌ ట్రోఫీ అందుకుంది. ఓవరాల్‌గా సీజన్‌లో నాలుగు టైటిల్స్‌ సొంతం చేసుకున్న ఆమె 63 మ్యాచ్‌ల్లో గెలిచి, 12 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.  

‘వరల్డ్‌ టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు ఫ్రాన్స్‌కు చెందిన ఫుట్‌బాల్‌ క్లబ్‌ పారిస్‌ సెయింట్‌ జెర్మయిన్‌ (పీఎస్‌జీ) గెల్చుకుంది. గత ఏడాది పీఎస్‌జీ జట్టు తొలిసారి ప్రతిష్టాత్మక చాంపియన్స్‌ లీగ్‌ టైటిల్‌ను సాధించింది. ‘టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు విభాగంలో భారత మహిళల క్రికెట్‌ జట్టు కూడా నామినేట్‌ అయింది. గత ఏడాది హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత జట్టు తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌ను సాధించింది. అయితే తుదకు ఈ అవార్డు పీఎస్‌జీ జట్టుకు లభించింది.  

రొమేనియా దిగ్గజ జిమ్నాస్ట్‌ నాడియా కొమనెసికి లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు దక్కింది. 64 ఏళ్ల నాడియా ఒలింపిక్స్‌ క్రీడల్లో 10కి 10 పాయింట్లు స్కోరు చేసిన తొలి జిమ్నాస్ట్‌గా రికార్డు నెలకొల్పింది. 1976 మాంట్రియల్‌ ఒలింపిక్స్‌లో ఆల్‌ అరౌండ్, అన్‌ఈవెన్‌ బార్స్, బ్యాలెన్స్‌ బీమ్‌ ఈవెంట్లలో నాడియా ‘పర్‌ఫెక్ట్‌ 10’ స్కోరుతో స్వర్ణ పతకాలు సాధించింది. అంతర్జాతీయ కెరీర్‌లో నాడియా మొత్తం తొమ్మిది ఒలింపిక్‌ పతకాలు, నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతకాలు, మూడు వరల్డ్‌కప్‌ ఫైనల్‌ పతకాలు గెలుచుకుంది. 

లారియస్‌ అవార్డు విజేతల జాబితా
వరల్డ్‌ స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ద ఇయర్‌: కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్, టెన్నిస్‌) 
వరల్డ్‌ స్పోర్ట్స్‌ఉమన్‌ ఆఫ్‌ ద ఇయర్‌: సబలెంకా (బెలారూస్, టెన్నిస్‌) 
వరల్డ్‌ టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌: పారిస్‌ సెయింట్‌ జెర్మయిన్‌ (ఫ్రాన్స్, ఫుట్‌బాల్‌) 
వరల్డ్‌ బ్రేక్‌థ్రూ ఆఫ్‌ ద ఇయర్‌: లాండో నోరిస్‌ (బ్రిటన్, ఫార్ములావన్‌) 
వరల్డ్‌ కమ్‌బ్యాక్‌ ఆఫ్‌ ద ఇయర్‌: రోరీ మెకిల్రాయ్‌ (నార్తర్న్‌ ఐర్లాండ్, గోల్ఫ్‌) 
వరల్డ్‌ స్పోర్ట్స్‌పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ (దివ్యాంగులు): గాబ్రియెల్‌ అరుజో సాంతోస్‌ (బ్రెజిల్, స్విమ్మింగ్‌) 
వరల్డ్‌ యాక్షన్‌ స్పోర్ట్స్‌పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌: చోల్‌ కిమ్‌ (అమెరికా, స్నో బోర్డ్‌) 
వరల్డ్‌ యంగ్‌ స్పోర్ట్స్‌పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌: లామినె యామల్‌ (స్పెయిన్, ఫుట్‌బాల్‌) 
స్పోర్టింగ్‌ ఇన్‌స్పిరేషన్‌ అవార్డు: టోనీ క్రూస్‌ (జర్మనీ, ఫుట్‌బాల్‌) 
లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు: నాడియా కొమనెసి (రొమేనియా, జిమ్నాస్టిక్స్‌) 
స్పోర్ట్‌ ఫర్‌ గుడ్‌ అవార్డు: ఫుట్‌బాల్‌ మాస్‌ 

Advertisement
 
Advertisement
Advertisement