Rishabh Pant Accident: పంత్‌ను కాపాడిన బస్‌ డ్రైవర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Bus Driver-Rescued Rishabh Pant Says-Dont Watch Cricket-Didnt Recognised - Sakshi

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్‌ పంత్ శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. పంత్ ప్రయాణిస్తున్న కారు.. ప్రమాదం బారిన పడడాన్ని మొదట చూసింది బస్ డ్రైవర్ సుశీల్ మన్‌. కారులో చిక్కుకున్న పంత్‌ను బయటకు లాగి ప్రాణాలు కాపాడింది ఆయనే. ప్రమాదం జరిగిన సమయంలో అసలు అక్కడ ఏం జరిగిందన్నది సుశీల్‌ మన్‌ స్థూలంగా వివరించాడు.

సుశీల్ మాట్లాడుతూ.. ''నేను హరిద్వార్ వైపు నుంచి వస్తున్నా. ఢిల్లీ వైపు నుంచి వేగంగా వస్తున్న ఒక కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అది చూసిన వెంటనే బస్సు ఆపాను. ఆ కారు బారికేడ్‌ను ఢీకొట్టి 200 మీటర్లు దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. అయితే కారులో ఎవరున్నది తెలిసేలోపే మంటలు అంటుకున్నాయి. ఈలోగా కారులో నుంచి బయటికి రావడానికి ఆ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు. వెంటనే నేను బయటికి లాగాను. ఆ తర్వాత ''నాపేరు రిషబ్‌ పంత్‌ అని.. టీమిండియా క్రికెటర్‌ అని.. మా అమ్మకు ఫోన్‌ చేయండి'' అని ఆ వ్యక్తి నాతో చెప్పాడు.

వాస్తవానికి నేను క్రికెట్‌ చూడను. పంత్‌ ఎవరో కూడా నాకు తెలియదు. ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడడం బాధ్యత. అందుకే వెంటనే అతన్ని(పంత్‌ను) బయటికి లాగి పక్కకు తీసుకెళ్లాను. ఇంతలో బస్‌లో మిగతావారు వచ్చి అతను క్రికెటర్‌ పంత్‌ అని చెప్పారు. ఆ తర్వాత కారులో ఇంకా ఎవరైనా ఉన్నారా అని తొంగి చూశాను. ఎవరు కనిపించలేదు. అయితే ఒక బ్లూబ్యాగ్‌ మాత్రం కనిపించింది. ఓపెన్‌ చేసి చూస్తే అందులో ఎనిమిది వేల రూపాయలు కనిపించాయి. పంత్‌ను ఆంబులెన్స్‌ ఎక్కించి ఆ తర్వాత బ్యాగ్‌ను అతనికి అందజేశాను. అక్కడి నుంచి పంత్‌ను డెహ్రాడూన్‌ ఆసుపత్రికి తరలించారు.'' అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా పంత్‌ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ అప్‌డేట్‌ ఇచ్చింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపింది. తాను పంత్ కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నారు. పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇంకా వైద్య పరీక్షలు జరుగుతున్నాయన్నారు. అతడికి అన్ని రకాల సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. త్వరగా కోలుకోవాలని  జై షా ఆకాంక్షించారు.

చదవండి: పంత్‌ పరిస్థితిపై బీసీసీఐ కీలక అప్‌డేట్‌

వేగంగా దూసుకొచ్చిన పంత్‌ కారు.. వీడియో వైరల్‌! ప్రమాదానికి కారణం?!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top